Actress Lavanya Tripathi: నాకు వరుణ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం..
నా అదృష్టం..
Actress Lavanya Tripathi: మెగా కోడలు, టాలీవుడ్ అందాల నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే 'సతీ లీలావతి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దేవ్ మోహన్ సరసన ఆమె నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలవుతోంది. ఈ సందర్భంగా లావణ్య తన సినిమా విశేషాలతో పాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ సినిమాలో లావణ్య ఒక సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తాను గర్భవతిని అన్న విషయం తెలిసిందని ఆమె వెల్లడించారు. "కథ విన్నప్పుడు వరుణ్‌కి చెప్పాను, అప్పటికి నేను ప్రెగ్నెంట్ అని తెలియదు. షూటింగ్ మధ్యలో విషయం తెలిసినప్పటికీ.. టీమ్ ఇచ్చిన సపోర్ట్‌తో సాఫీగా పూర్తి చేశాను. కేవలం యాక్షన్ సీక్వెన్స్‌లలో మాత్రమే చిన్న మార్పులు చేశాం. ఆ సమయంలో షూటింగ్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది" అని ఆమె తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
సినిమాలోని భార్యాభర్తల రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తన రియల్ లైఫ్ పార్ట్నర్ వరుణ్ తేజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు లావణ్య. "సినిమాలో చూపించే భార్యాభర్తల గొడవలు బయట ఉండవు. నిజ జీవితంలో నాకు వరుణ్ లాంటి అద్భుతమైన భర్త దొరకడం నా అదృష్టం. ప్రస్తుతం నా భర్త, నా కొడుకుతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అని ఆమె పేర్కొన్నారు. అలాగే వరుణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, అయితే అది ఒక వైవిధ్యమైన కథ అయి ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రస్తుతం లావణ్య తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. "ఇప్పుడు నాకు కొత్త సినిమాలేవీ ఒప్పుకోవాలని లేదు. నా కొడుకుతో గడుపుతుంటే సమయమే తెలియడం లేదు. ప్రస్తుతానికి నా ఫ్యామిలీనే నా ఫస్ట్ ప్రయారిటీ" అని స్పష్టం చేశారు. ఇక కమల్ హాసన్ గారి క్లాసిక్ మూవీ 'సతీ లీలావతి'తో తమ సినిమాకు ఎలాంటి పోలిక లేదని, ఇదొక రిఫ్రెషింగ్ ఎంటర్‌టైనర్ అని లావణ్య వివరించారు.
కామెడీ, ఎమోషన్ కలగలిసిన ఈ 'సతీ లీలావతి' ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.