Actress Rashmika Mandanna: పెళ్లి డేట్ పుకార్లపై రష్మిక రియాక్షన్ ఇదే..

రష్మిక రియాక్షన్ ఇదే..

Update: 2025-12-04 06:45 GMT

Actress Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి రష్మిక తొలిసారిగా స్పందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందంటూ వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చాయి. రష్మిక ఈ వార్తలపై చాలా తెలివిగా స్పందించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. "నేను ఈ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని వీటిని ఇప్పుడు ఖండించనూ లేను. పెళ్లి గురించి సరైన సమయంలో, సరైన చోట మాట్లాడతాను. ఆ వివరాలను కచ్చితంగా అందరితో పంచుకుంటాను. అంతకుమించి ఇప్పుడేమీ చెప్పలేను" అని పేర్కొన్నారు.

రష్మిక తన వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడటం ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. పర్సనల్ లైఫ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటానని, ఇంట్లో పని గురించి, బయట వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించనని తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమని రష్మిక అన్నారు. "ఈ ఏడాది నా ఐదు సినిమాలు విడుదలై మంచి ఆదరణ పొందాయి. భాష, జానర్ వంటి హద్దులు లేకుండా అన్ని రకాల పాత్రలు చేయాలని ముందునుంచీ అనుకున్నాను. నా విభిన్న పాత్రలను చూసి ప్రేక్షకులు ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది" అని ఆమె వివరించారు. రష్మిక స్పందనతో, విజయ్ దేవరకొండతో ఆమె వివాహం గురించి అభిమానులు మరియు సినీ వర్గాలు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News