Actress Samantha Ruth Prabhu: ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా సమంత పోరాటం
సమంత పోరాటం
Actress Samantha Ruth Prabhu: ప్రముఖ సినీ నటి సమంత రూత్ ప్రభు మహిళలపై పెరుగుతున్న ఆన్‌లైన్ హింసను అరికట్టేందుకు నడుం బిగించారు. ఇందుకోసం ఆమె ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్ విమెన్ ఇండియాతో చేతులు కలిపారు. ఆన్‌లైన్ వేదికగా మహిళలపై జరుగుతున్న హింసను అంతం చేయడమే లక్ష్యంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటున్నట్లు సమంత స్వయంగా వెల్లడించారు.
సమంత ఆవేదన
సోషల్ మీడియాలో తనకున్న 37 మిలియన్ల మంది ఫాలోవర్లను ఉద్దేశించి మాట్లాడిన సమంత ఆన్‌లైన్ వేధింపులపై తన అనుభవాలను పంచుకున్నారు. "సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్, ఆన్‌లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫొటోల వంటి అనేక రూపాల్లో మహిళలు హింసకు గురవుతున్నారు. ఒకప్పుడు ప్రత్యక్షంగా జరిగే ఈ వేధింపులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లపైకి చేరాయి. ఇది మహిళలను మానసికంగా కుంగదీస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నేను కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రచారం లక్ష్యం:
మహిళల్లో ఈ అంశంపై అవగాహన పెంచడమే ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సమంత స్పష్టం చేశారు. ఆన్‌లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు, కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. యూఎన్ విమెన్ ఇండియా నిర్వహించే ఈ ముఖ్యమైన ప్రచారంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు సమంత పేర్కొన్నారు. ఆమె తీసుకున్న ఈ చొరవ మహిళా సాధికారతకు, డిజిటల్ భద్రతకు ఒక గొప్ప అడుగుగా చెప్పవచ్చు.