Adivi Sesh’s Bold Experiment for Dacoit: డెకాయిట్ కోసం అడివి శేష్ సాహసం.. ఒకే సీన్, రెండు భాషలు.. వేర్వేరు ఎమోషన్లు..
ఒకే సీన్, రెండు భాషలు.. వేర్వేరు ఎమోషన్లు..
Adivi Sesh’s Bold Experiment for Dacoit: టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ఆయన తదుపరి చిత్రం డెకాయిట్ ప్రమోషన్లలో భాగంగా, ద్విభాషా చిత్రాల చిత్రీకరణలో ఎదురయ్యే సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు షానీల్ డియోతో కలిసి పనిచేయడం, తెలుగు-హిందీ భాషల నేటివిటీని కాపాడటం వెనుక ఉన్న కష్టాన్ని ఆయన వివరించారు.
నిజాయతీ గల భాగస్వామ్యం:
దర్శకుడు షానీల్ - అడివి శేష్ కలిసి ఈ చిత్రానికి కథ అందించారు. షూటింగ్ సమయంలో తమ మధ్య ఉన్న స్వేచ్ఛ గురించి శేష్ మాట్లాడుతూ.. "ఒక షాట్ నాకు నచ్చకపోయినా, ఆయనకు నచ్చకపోయినా ముఖం మీదే చెప్పేసుకునేంత స్వేచ్ఛ మాకుంది. వృత్తిపరమైన అడ్డంకులు ఏవీ లేకుండా పనిచేయడమే మాకు కలిసొచ్చింది" అని తెలిపారు. షానీల్ మాతృభాష హిందీ కాగా శేష్ తెలుగు వాడు కావడంతో రెండు భాషల్లోనూ భావోద్వేగాలుసరిగ్గా పండేలా ఇద్దరూ బాధ్యతను పంచుకున్నట్లు చెప్పారు.
ప్రతీ సీన్.. రెండు వెర్షన్లు..
ఒకే సినిమాను రెండు భాషల్లో తీయడం అంటే కేవలం డబ్బింగ్ చెప్పడం కాదని, ప్రతీ టేక్‌ను వేర్వేరుగా చిత్రీకరించామని శేష్ వెల్లడించారు. ముందుగా హిందీలో సీన్ చిత్రీకరించి ఆ మూడ్‌ను సెట్ చేసుకున్న తర్వాత, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి మళ్ళీ నటించేవారట. తెలుగు ప్రేక్షకులకు నచ్చే పంచ్ డైలాగ్ సీన్ ప్రారంభంలో ఉంటే, హిందీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు అదే డైలాగ్‌ను సీన్ చివరలో లేదా వేరే చోట వాడినట్లు పేర్కొన్నారు. ఇలా ప్రతీ డైలాగ్‌ను, ప్రతీ టేక్‌ను రెండు భాషలకు విడివిడిగా ట్రీట్ చేసినట్లు ఆయన వివరించారు.
విడుదల ఎప్పుడు?
సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుందని, ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.