Aish Shuts Down Rumours: పుకార్లకు ఐష్ చెక్.. అభిషేక్ కు విషెస్

అభిషేక్ కు విషెస్

Update: 2026-02-06 06:44 GMT

Aish Shuts Down Rumours: బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లకు ఐష్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. గురువారం 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన భర్త అభిషేక్‌కు సోషల్ మీడియా వేదికగా ఆమె ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు తెలిపారు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారని, మనస్పర్థల కారణంగా విడివిడిగా ఉంటున్నారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెబుతూ, తమ మధ్య అనుబంధం చెక్కుచెదరలేదని ఐశ్వర్య స్పష్టం చేశారు.

అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఐశ్వర్య రాయ్.. దానికి ఎంతో ఆత్మీయమైన సందేశాన్ని జత చేశారు. "ప్రియమైన బేబీ-పాపా.. నీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఎప్పుడూ ప్రేమ, ప్రశాంతత, సంతోషం, సంతృప్తి, ఆరోగ్యంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దీవెనలు నీపై ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఇలాగే మెరిసిపోతూ ఉండాలి" అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఖుషీ అవుతూ అభిషేక్‌కు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.

గత కొన్ని నెలలుగా బచ్చన్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి వేరేగా ఉంటున్నారని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తలపై ఐశ్వర్య గానీ, అభిషేక్ గానీ ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. కానీ, అడపాదడపా బహిరంగ కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ ఆ పుకార్లను కొట్టిపారేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ బర్త్‌డే పోస్ట్‌తో తాము కలిసే ఉన్నామనే బలమైన సంకేతాన్ని ఐశ్వర్య మరోసారి ఇచ్చారు.

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ 2007లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఎప్పుడూ హుందాగా వ్యవహరించే ఈ జంట, తాజా పోస్ట్‌తో తమ వ్యక్తిగత జీవితంపై అనవసరంగా మాట్లాడుకునే వారికి గట్టి సమాధానమే ఇచ్చారు.

Tags:    

Similar News