Allu Arjun: రియల్ హీరో అనిపించుకున్న బన్నీ.. దివ్యాంగురాలికి జీవితాంతం పెన్షన్..
దివ్యాంగురాలికి జీవితాంతం పెన్షన్..
Allu Arjun: వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తనకు పెద్ద మనసుందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిని కోల్పోయి అనాథగా మారిన ఒక దివ్యాంగురాలికి అండగా నిలిచి, ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించారు.
ఒంటరిగా మిగిలిన దుర్గ.. అండగా నిలిచిన అల్లు అర్జున్
కాకినాడ జిల్లా వేట్లపాలెంకు చెందిన కడింపల్లి దుర్గ ఒక మానసిక దివ్యాంగురాలు. గత నెల 28న జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో ఆమె తండ్రి ధనరాజు ప్రాణాలు కోల్పోయారు. తల్లి అంతకుముందే మరణించడంతో, తండ్రిని కూడా కోల్పోయిన దుర్గ ఒక్కసారిగా అనాథగా మారింది. ఈ హృదయ విదారక గాథ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ దృష్టికి వెళ్లింది.
జీవితాంతం ఆర్థిక భరోసా
దుర్గ దీనస్థితిపై స్పందించిన అల్లు అర్జున్, వెంటనే తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. ఆమె పరిస్థితిని స్వయంగా తెలుసుకున్న బన్నీ, ఆమెకు శాశ్వత ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. దుర్గ పోషణ నిమిత్తం ప్రతి నెలా రూ.7,500 చొప్పున జీవితాంతం పెన్షన్ అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం ప్రతి నెలా నేరుగా ఆమె బ్యాంకు ఖాతాలోనే జమ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ వెల్లడించారు.
అభిమానుల హర్షం
బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ చేసిన ఈ సాయం పట్ల స్థానికులతో పాటు మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో బన్నీ ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపితమైందని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.