Allu Arjun Reviews: పెద్దిపై అల్లు అర్జున్ రివ్యూ... రామ్ చరణ్ నటనకు ఫిదా
రామ్ చరణ్ నటనకు ఫిదా
Allu Arjun Reviews: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటను కొనసాగిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. విడుదలైన తొలి రోజే ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన ‘పెద్ది’.. ఇప్పుడు లాంగ్ రన్‌లోనూ అదే జోరు చూపిస్తోంది.
తాజాగా ఈ సినిమా 5 రోజుల అఫీషియల్ వసూళ్లను ప్రకటిస్తూ మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి.. అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఇక నిన్న సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ.. ఇండియాలో ఏకంగా రూ.12.05 కోట్ల నెట్, రూ.22 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా నిన్న 28 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడం చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనం.
ఇదిలా ఉంటే, ‘పెద్ది’ సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో రివ్యూ ఇస్తూ రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ యాక్టింగ్ చూసి తనకు ఎంతో గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ‘‘నిన్న రాత్రి జూన్ 8న పెద్ది సినిమా చూశాను. పెద్ది పాత్రలో రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పడ్డ కఠినమైన శ్రమ, సహజమైన నటన, అసాధారణమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, క్రేజీ డ్యాన్స్ మూవ్స్ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తాయి’’ అని బన్నీ పేర్కొన్నారు.
అలాగే ఈ సినిమాలో నటించిన జగపతి బాబు నటనను ప్రత్యేకంగా అభినందించిన అల్లు అర్జున్.. హీరోయిన్ జాన్వీ కపూర్‌తో పాటు చిత్ర సాంకేతిక నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబును అభినందిస్తూ.. చరణ్‌ను మరింత ఉన్నత స్థాయిలో ఆవిష్కరించారని కొనియాడారు.