‘Raaka’ Shoot: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రాకా'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో వేగంగా జరుగుతోంది. అయితే, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌కు మారనుంది.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలోనే జరిగింది. ఇప్పుడు తొలిసారిగా ఈ సినిమా యూనిట్ హైదరాబాద్‌లో షూటింగ్ చేయబోతోంది.

మరోవైపు, రాబోయే నెలల్లో విదేశాల్లో కూడా షూటింగ్ జరిపేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ముందుగా కొన్ని కీలక సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరించాలని అట్లీ భావించారట. అయితే, ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఘర్షణల కారణంగా ఆ ప్లాన్‌ను మార్చుకున్నట్లు సమాచారం. దుబాయ్‌లో తీయాలనుకున్న సన్నివేశాలను హైదరాబాద్‌లోనే చిత్రీకరించాలని ఇప్పుడు అట్లీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. వీరితో పాటు జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీరి పేర్లను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.

ఈ భారీ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Tags: