Ameesha Patel: ఇన్‌స్టాగ్రామర్లను కాదు.. నటులను నమ్మండి.. బాలీవుడ్‌కు అమీషా పటేల్ చురకలు..
బాలీవుడ్‌కు అమీషా పటేల్ చురకలు..
Ameesha Patel: రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరిశ్రమలోని ప్రస్తుత పోకడలపై ఆమె సంధించిన విమర్శలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అమీషా పటేల్ ఏమన్నారంటే..?
సినిమా చూసిన అనంతరం అమీషా తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "ఆదిత్య ఒక ప్రాజెక్ట్ ను కాదు, ఒక అద్భుతమైన సినిమాను తీశారు. పార్టీలలో ట్రెండ్ అయ్యే ఇన్‌స్టాగ్రామర్లను కాకుండా కేవలం ప్రతిభ గల నటులనే ఆయన ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికైనా కేవలం ప్రాజెక్టులు చేయడం ఆపి, నిజమైన సినిమాలు చేయడం మొదలుపెట్టండి" అంటూ బాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు గట్టి కనువిప్పు కలిగించారు.
బాక్సాఫీస్ వద్ద ధురంధర్ వేట:
మార్చి 19న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్, రికార్డులను తిరగరాస్తోంది. కేవలం 6 రోజుల్లోనే భారత్‌లో సుమారు రూ. 500 - రూ. 600 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 900 కోట్ల మార్కును దాటి, 2026లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
దిగ్గజాల ప్రశంసలు..
ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించింది. అమీషా పటేల్‌తో పాటు ఇప్పటికే దక్షిణాది సూపర్ స్టార్లు రజనీకాంత్, అల్లు అర్జున్, మహేశ్ బాబు కూడా ఈ సినిమా మేకింగ్‌ను, నటీనటుల ప్రతిభను కొనియాడారు.
కేవలం గ్లామర్ వెనుక పరిగెత్తకుండా, కథను నమ్మి తీస్తే ఫలితం ఎలా ఉంటుందో ధురంధర్ 2 నిరూపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.