Anirudh–Kavya Maran Wedding: ప్రముఖ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ రిసెప్షన్ వేడుక నవంబర్ 21న చెన్నై నగరంలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు రావాల్సిందిగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ దంపతులు తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నేతలను స్వయంగా ఆహ్వానించారు.

సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లకు వెడ్డింగ్ కార్డులు

శుక్రవారం హైదరాబాద్ వచ్చిన కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ తొలుత జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె కావ్య, అనిరుధ్‌ల వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. ఈ విషయాన్ని సీఎంవో అధికారికంగా ధ్రువీకరించింది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సతీమణి శైలిమను కలిసి ఆహ్వాన పత్రికను అందజేయగా, కాబోయే దంపతులకు కేటీఆర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

పుకార్లకు తెర.. పెళ్లి ఎక్కడంటే?

గత కొంతకాలంగా అనిరుధ్, కావ్యా మారన్‌ల సంబంధం గురించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. గతంలో వీటిని అనిరుధ్ ఖండించినప్పటికీ, తాజా వివాహ ఆహ్వానాలతో ఈ ప్రచారాలన్నింటికీ పూర్తి స్పష్టత వచ్చింది. రిసెప్షన్ తేదీని అధికారికంగా నవంబర్ 21గా ప్రకటించినప్పటికీ, పెళ్లి ముహూర్తంపై మాత్రం ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అయితే నవంబర్ 10 లేదా 11 తేదీల్లో గ్రీస్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన దేశవ్యాప్త ప్రముఖులు చెన్నైలో జరగనున్న ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.

Tags: