Ram Charan’s Interesting Comments: చదువులో యావరేజ్, స్పోర్ట్స్‌లో టాపర్.. రామ్ చరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

రామ్ చరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Update: 2026-05-29 06:22 GMT

Ram Charan’s Interesting Comments: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుమారు రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో చరణ్ తన వ్యక్తిగత జీవితం, విద్యాభ్యాసం, సినిమా షూటింగ్ విశేషాలను సరదాగా పంచుకున్నారు.

చదువులో వీక్.. స్పోర్ట్స్‌లో కింగ్..

తన పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను చదువులో ఎప్పుడూ గొప్ప స్టూడెంట్‌ని కాదు, నా గ్రేడ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ ఆటలంటే నాకు ప్రాణం. స్కూల్ రోజుల్లో వాలీబాల్, బాస్కెట్‌బాల్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాను. క్రికెట్‌తో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ రన్నింగ్ ఈవెంట్లలోనూ చురుగ్గా పాల్గొనేవాడిని. చదువులో ఎలాగూ వెనుకబడ్డాను కాబట్టి.. కనీసం ఆటల్లోనైనా రాణించి ప్రూవ్ చేసుకోవాలి కదా?" అంటూ చరణ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

క్రాస్‌ఓవర్ అథ్లెట్ గా మెగా పవర్ స్టార్..

దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న పెద్ది చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర కేవలం ఒక్క ఆటకే పరిమితం కాకుండా.. క్రికెట్, రెజ్లింగ్, స్ప్రింటింగ్ వంటి మూడు విభిన్న క్రీడలలో రాణించే ఒక పవర్‌ఫుల్ క్రాస్‌ఓవర్ అథ్లెట్ గా కనిపించనుంది. ఈ తరహా క్రీడల నేపథ్యంలో వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో తన చేతికి బలమైన గాయమైందని చరణ్ ఈ ఇంటర్వ్యూలో తొలిసారి వెల్లడించారు. అయినా సరే పాత్ర పర్ఫెక్షన్ కోసం ఎక్కడా తగ్గకుండా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు.

జూన్ 4న బాక్సాఫీస్ వేట..

రెండున్నరేళ్ల గ్యాప్ వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ముందుకు మునుపటి కంటే మరింత బలంగా, గొప్పగా, సరికొత్త ఎనర్జీతో వస్తున్నానని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటులు జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదల కానుంది.

Tags:    

Similar News