Bellamkonda Sai Srinivas: హైదరాబాద్‌లో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం
బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం
Bellamkonda Sai Srinivas: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. శ్రీనివాస్ తన ప్రేయసి కావ్య రెడ్డితో ఉంగరాలు మార్చుకుని కొత్త జీవితానికి నాంది పలికారు.
కావ్య రెడ్డి విషయానికి వస్తే, ఆమెకు సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేదు. హైదరాబాద్‌కు చెందిన ఆమె, ఫ్రాన్స్‌లో ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోగం చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.
ఈ వేడుకకు టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. నటి సంయుక్త మీనన్, స్టార్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. 'అల్లుడు శీను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీనివాస్, ప్రస్తుతం 'టైసన్ నాయుడు' చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెళ్లి వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.