'Korean Kanakaraju': కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భీమవరం సిద్ధం.. పవన్ కల్యాణ్ హాజరవుతారా?
పవన్ కల్యాణ్ హాజరవుతారా?
'Korean Kanakaraju': యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం కొరియన్ కనకరాజు ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు పూర్తి చేసింది.
భీమవరంలో సందడి
భీమవరంలోని ప్రముఖ ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఆగస్టు 4న సాయంత్రం 4:30 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తమన్ స్వరపరిచిన సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొని సందడి చేయనున్నారు.
పవన్ కల్యాణ్ హాజరుపై ఉత్కంఠ
కాగా ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల ఆయన భుజానికి సర్జరీ జరగడం, ఇంకా బ్యాండేజ్‌తోనే కోలుకుంటుండటంతో ఈ కార్యక్రమానికి ఆయన వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భీమవరం వేడుకతో సినిమా ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్న నిర్మాతలు, ఈ చిత్రం కొరియన్ కనకరాజును ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.