Kaun Banega Crorepati Season 18: బుల్లితెరపై బిగ్‌బీ సందడి.. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 18 షురూ.. టెలికాస్ట్ డేట్ ఫిక్స్..
టెలికాస్ట్ డేట్ ఫిక్స్..
Kaun Banega Crorepati Season 18: భారతీయ బుల్లితెర చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ లెజెండ్, షెహెన్‌షా అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ పాపులర్ షో 18వ సీజన్ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా తన అధికారిక బ్లాగ్ వేదికగా వెల్లడించారు.
ముందుగా గురు పౌర్ణమి సందర్భంగా అభిమానులు తెలిపిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలిపిన అమితాబ్, KBC 18వ సీజన్ షూటింగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. షోకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని చెబుతూ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను షేర్ చేశారు. "ఇక అసలైన పరీక్ష మొదలుకానుంది. ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి, ఇక అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
కొత్త థీమ్ - గట్టిగా ఆలోచించాల్సిందే..
ఈసారి షో ప్రమోషన్స్, ప్రోమోల్లో ప్రస్తావించినట్లుగా "జరా సోచ్‌నా పడేగా" (కాస్త గట్టిగా ఆలోచించాల్సిందే) అనే కొత్త క్యాప్షన్‌తో వస్తున్నామని, ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని బిగ్‌బీ హింట్ ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి ముంబైలో ఈ కార్యక్రమ చిత్రీకరణ (షూటింగ్) అధికారికంగా ప్రారంభం కానుంది. అలాగే ఆగస్టు 10 నుంచి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన హు వాంట్స్ టు బీ ఏ మిలియనీర్? షోకు అధికారిక హిందీ రూపమే ఈ KBC. మూడో సీజన్‌కు మాత్రమే షారుఖ్ ఖాన్ హోస్టింగ్ చేయగా, మిగిలిన 17 సీజన్లుగా అమితాబ్ బచ్చనే తన మార్క్ వ్యాఖ్యాతగా అలరిస్తూ ఈ ప్రోగ్రామ్‌ను భారత్‌లోనే బిగ్గెస్ట్ టెలివిజన్ షోగా నిలిపారు. బిగ్‌బీ హోస్టింగ్‌తో రాబోతున్న KBC 18వ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు మరియు క్విజ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.