Big Shock for Actress Madhaveelatha: నటి మాధవీలతకు బిగ్ షాక్.. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
Big Shock for Actress Madhaveelatha: టాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత చిక్కుల్లో పడ్డారు. నచ్చావులే, స్నేహితుడా వంటి చిత్రాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెపై హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేవుడిపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలే ఇందుకు కారణం. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్న మాధవీలత, ఇటీవల షిర్డీ సాయిబాబాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సాయిబాబా అసలు దేవుడే కాదని ఆమె సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురు భక్తులు పోలీసులను ఆశ్రయించారు. ఆమెతో పాటు ఈ తరహా వ్యాఖ్యలను వ్యాప్తి చేసిన మరికొందరు యూట్యూబర్లపై కూడా ఫిర్యాదులు అందాయి.
పోలీసుల యాక్షన్.. విచారణకు ఆదేశం
ఈ పోస్టులు ప్రజల మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీశాయని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా మతపరమైన అంశాలపై అసత్య ప్రచారం చేసినా, విద్వేషాలు రెచ్చగొట్టినా ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
నిజానికి మాధవీలత తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతారని ఆమె అభిమానులు అంటుండగా, దేవుళ్ల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేపు పోలీస్ స్టేషన్‌లో హాజరైన తర్వాత ఆమె దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.