‘iBomma’ Ravi: 'ఐబొమ్మ' రవికి బిగ్ షాక్... బెయిల్ పిటిషన్లు కొట్టివేత!

బెయిల్ పిటిషన్లు కొట్టివేత!

Update: 2026-01-08 05:47 GMT

‘iBomma’ Ravi: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' సూత్రధారి ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన ఐదు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

విదేశాలకు పారిపోయే ప్రమాదం: విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. నిందితుడు ఇమ్మడి రవికి విదేశీ పౌరసత్వం ఉందని, అతనికి ఇప్పుడు బెయిల్ ఇస్తే వెంటనే దేశం దాటి పరారయ్యే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు. ఈ కేసు ప్రస్తుతం అత్యంత కీలకమైన దర్యాప్తు దశలో ఉందని, ఈ సమయంలో నిందితుడిని బయటకు వదిలితే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని పోలీసులు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

కస్టడీలో వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు: పోలీసులు కోర్టుకు సమర్పించిన కస్టడీ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రవి కేవలం పైరసీ మాత్రమే కాకుండా, నకిలీ గుర్తింపు కార్డులతో బ్యాంక్ ఖాతాలు సృష్టించి ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు తేలింది. 2017లో తనతో పాటు ఒకే హాస్టల్ గదిలో ఉన్న ప్రహ్లాద్ అనే స్నేహితుడి పదో తరగతి సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులను దొంగిలించి, వాటి ద్వారా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నకిలీ పత్రాల ద్వారానే వివిధ బ్యాంక్ ఖాతాలను తెరిచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

భారీగా అక్రమ సంపాదన: ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కొత్త సినిమాల హెచ్‌డీ ప్రింట్‌లను టెలిగ్రామ్ వంటి మార్గాల్లో కొనుగోలు చేసి అప్‌లోడ్ చేస్తున్నట్లు రవి అంగీకరించాడు. ఈ వెబ్‌సైట్‌లో వచ్చే బెట్టింగ్ ప్రకటనల ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 13.40 కోట్ల మేర సంపాదించినట్లు పోలీసులు కనుగొన్నారు. పన్ను ఎగవేత కోసం ఈ మొత్తంలో సుమారు రూ. 90 లక్షలను తన సోదరి బ్యాంక్ ఖాతాకు మళ్లించినట్లు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.

Tags:    

Similar News