Bigg Boss Fame Lobo: బిగ్ బాస్ ఫేమ్..లోబోకు ఏడాది జైలు శిక్ష
లోబోకు ఏడాది జైలు శిక్ష;
Bigg Boss Fame Lobo: యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఖయూమ్ అలియాస్ లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్ష,రూ.12,500 జరిమానా విధిస్తూ జనగామ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏడేళ్ల క్రితం (2018లో) జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది.
2018లో లోబో తన కారులో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తుండగా, జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమందికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు లోబోపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఏడేళ్ల పాటు విచారణ జరిగింది.
విచారణ అనంతరం, లోబో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని కోర్టు నిర్ధారించింది. దీంతో అతడికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.