Bollywood Actress Yami Gautam: గ్లామర్ కంటే నటనకే ఫస్ట్ ప్రెఫరెన్స్:బాలీవుడ్ నటి యామీ గౌతమ్

బాలీవుడ్ నటి యామీ గౌతమ్

Update: 2026-07-20 07:02 GMT

Bollywood Actress Yami Gautam: భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ పాత్రల కంటే కథకు, వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే నటీమణులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఒకరు. నాయికా ప్రాధాన్య చిత్రాల్లో ఎప్పుడూ తన సత్తా చాటే యామీ గౌతమ్.. ‘ఆర్టికల్ 370’ చిత్రంలో పోషించిన ఇంటెలిజెన్స్ అధికారిణి ‘జూనీ హక్సర్’ పాత్రతో దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే పవర్‌ఫుల్ పాత్ర ఆమెను జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది.

జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ రద్దుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా యామీ గౌతమ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఒకవైపు దేశభక్తిని చాటుతూనే.. మరోవైపు భావోద్వేగమైన సందర్భాల్లో పాత్రలోని గంభీరతను ఎక్కడా కోల్పోకుండా మెప్పించారు. ముఖ్యంగా ఉత్కంఠభరితమైన యాక్షన్ సీన్స్‌లోనూ, నిశ్శబ్దంగా ఉండే సన్నివేశాల్లో కేవలం తన కళ్లతోనే హావభావాలు పలికించి సినీ ప్రియులను కట్టిపడేశారు.

"తాను ఎంచుకునే సినిమాలు ప్రస్తుత సామాజిక అంశాలతో ముడిపడి ఉండటం వల్లే కొందరు సోషల్ మీడియాలో తనను విమర్శిస్తున్నారు" అని యామీ గౌతమ్ గతంలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమె కథల ఎంపికలో అస్సలు తగ్గడం లేదు. ఇటీవలే వచ్చిన ‘హక్’ చిత్రంలో ‘షాజియా’ పాత్రలో కనిపించి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యామీ గౌతమ్ కేవలం సీరియస్ పాత్రలకే పరిమితం అనుకుంటున్న సమయంలో.. ‘బాల’ చిత్రంలో ఫుల్ కామెడీతో నవ్వులు పూయించి తనేంటో నిరూపించుకున్నారు. పాత్ర ఏదైనా సరే.. అందులోకి పరకాయ ప్రవేశం చేయడమే యామీ గౌతమ్‌కు తెలుసంటూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ జాతీయ ఉత్తమ నటి.. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా దూసుకుపోతోంది.

Tags:    

Similar News