Rashmika: గాయం వల్ల దక్కిన బోనస్ టైమ్.. విజయ్‌తో ఇంట్లో గడిపిన క్షణాలను పంచుకున్న రష్మిక..
రష్మిక..
Rashmika: సినిమా షూటింగ్‌లో గాయపడి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తిరిగి షూటింగ్‌లతో బిజీ అయ్యేందుకు సిద్ధమైన ఆమె, విశ్రాంతి సమయంలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ విరామం తనకు ఎన్నో తీపి గుర్తులను మిగిల్చిందని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు.
విజయ్‌తో గడిపేందుకే విశ్వం ప్లాన్ చేసిందేమో
వివాహానంతరం తమ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఎదురైన పరిస్థితులను, గాయం సమయాన్ని రష్మిక గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన మొదట్లో వరుస షూటింగ్‌ల వల్ల దాదాపు మూడు నెలల పాటు ఇద్దరం ముఖాముఖి కలుసుకోలేకపోయామని, కేవలం ఫోన్ కాల్స్ ద్వారానే మాట్లాడుకున్నామని తెలిపారు. "కాస్త రెస్ట్ తీసుకో.. నిన్ను ఇంట్లోనే ఉంచుతా" అని విశ్వమే ప్లాన్ చేసి తనకు ఈ గాయం అయ్యేలా చేసిందేమోనని చమత్కరించారు. పెళ్లి తర్వాత తామిద్దరం కలిసి ఎక్కువ రోజులు ఒకేచోట గడిపింది ఈ విశ్రాంతి సమయంలోనేనని పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరం కలిసి టీవీ షోలు చూస్తూ గడిపామని చెప్పారు. విజయ్‌కు సీరియస్ డ్రామాలు నచ్చితే, తనకు కొరియన్ డ్రామాలు ఇష్టమని, చివరకు విజయ్‌కి కూడా కే-డ్రామాలను అలవాటు చేసేశానని నవ్వుతూ వెల్లడించారు. "మనం ఇలాగే ఎప్పుడూ ఎక్కువ సమయం గడపాలి.. కాకపోతే ఇలాంటి గాయాలు ఏమీ లేకుండా" అంటూ విజయ్ తనను నిత్యం ఆటపట్టిస్తుండేవాడని రష్మిక తెలిపారు.
సెట్స్‌పై గాయం.. లైన్‌లో రెండు భారీ చిత్రాలు
మైసా సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక పాటకు డ్యాన్స్ చేస్తుండగా రష్మిక తుంటి భాగానికి బలమైన దెబ్బ తగిలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమె కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వీరి వివాహం తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా తెరపై కనిపించనున్న భారీ చిత్రం రణబాలి అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. గాయం నుంచి కోలుకున్న రష్మిక, ఈ రెండు చిత్రాల ప్రమోషన్లు మరియు తదుపరి ప్రాజెక్టులతో మళ్లీ పూర్తి స్థాయిలో దూకుడు పెంచనున్నారు.