Brahmanandam: పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం క్లారిటీ
బ్రహ్మానందం క్లారిటీ
Brahmanandam: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరుగాంచిన నటుడు బ్రహ్మానందం రాసిన ఆత్మకథ "నేను మీ బ్రహ్మానందం" పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ పుస్తకం బ్రహ్మానందం జీవితంలోని తెలియని కోణాలను ఆవిష్కరిస్తుంది. ఇందులో ఆయన పేద కుటుంబం నుంచి సినీ పరిశ్రమలో అగ్రస్థాయికి ఎలా ఎదిగారు, ఆయనకు ఎదురైన కష్టాలు, సవాళ్లు, అలాగే ఆయన గీసిన అద్భుతమైన చిత్రాల గురించి కూడా వివరించారు.
బ్రహ్మానందం తన సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలు, తన జీవిత పాఠాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. బ్రహ్మానందం కేవలం ఒక హాస్యనటుడు మాత్రమే కాదని, ఆయన ఒక కళాకారుడు, పండితుడు అని ప్రశంసించారు. అలాగే, ఈ పుస్తకం దేశవ్యాప్తంగా ఉన్న పాఠకులకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఆత్మకథ ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావచ్చనే ఉద్దేశంతో రాసినట్లు బ్రహ్మానందం తెలిపారు. దేశంలోని ఎక్కువ మందికి చేరువ కావాలంటే హిందీ భాష అవసరమని, ప్రపంచవ్యాప్తంగా చేరువ కావాలంటే ఆంగ్లం అవసరమని నొక్కి చెప్పారు. బ్రహ్మానందం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఈ వేదికపై స్పష్టం చేశారు. తన దృష్టి పూర్తిగా కళ, సాహిత్యం పైనే ఉంటుందని అన్నారు.