Chiranjeevi: ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు చేపట్టాలి: కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతిపత్రం
చిరంజీవి వినతిపత్రం
Chiranjeevi: కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ మోసాల నుంచి రక్షణ కల్పించేందుకు మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాలని అగ్రకథానాయకుడు చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశం అనంతరం, ఆయన సూచన మేరకు ఈ వినతిపత్రాన్ని అందించినట్లు చిరంజీవి తాజాగా తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు.
ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలను అడ్డుకునేందుకు కఠినమైన రక్షణ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ అంశాలను ముందుకు తీసుకెళ్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కళాకారుల గౌరవం, వ్యక్తిగత గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను పరిరక్షించడం అందరి బాధ్యత అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
నవంబర్ 2న చిరంజీవి, రామ్ చరణ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశారు. డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై ఆయనతో చర్చించారు. “మా ఆందోళనలను అమిత్‌షా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించి, మరిన్ని చర్యలు, కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టే దిశగా కృషి చేస్తుందని మాకు హామీ ఇచ్చారు” అని చిరు అప్పుడు పోస్ట్ పెట్టారు.
చిరంజీవి వినతిపత్రంలో కళాకారుల ముఖం, వాయిస్, ఇమేజ్‌లను అనధికారంగా వాడకుండా నిరోధించాలని, సమ్మతి లేకుండా డిజిటల్ మార్పులు చేయకూడదని, కఠిన శిక్షలు విధించాలని సూచించారు. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దుర్వినియోగం తీవ్ర సమస్యగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సినీ, టీవీ పరిశ్రమలో పనిచేసే కళాకారుల గౌరవం, ప్రైవసీ, వృత్తిపరమైన హక్కులు రక్షించబడాలని కోరారు.
డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్, తయారు చేసిన వీడియోలు ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడుతున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు ఈ వినతిపత్రం అందించబడింది. చిరంజీవి ఈ చర్య సినీ పరిశ్రమ మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏఐ దుర్వినియోగంపై కఠిన చట్టాలు రావాలని అందరూ ఆశిస్తున్నారు.