Sunny Deol’s ‘Surya’: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఈ సినిమా టీజర్‌పై ఫిర్యాదు చేసింది. వైద్యులపై హింసను ప్రోత్సహించేలా టీజర్ ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో నవంబర్ 20న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడగా, జనవరి 15న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

సన్నీ డియోల్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 19న ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా వివాదానికి తెరలేపినట్టయ్యింది. ఈ సినిమా వైద్యులపై హింసను ప్రోత్సహించేలా ఉందని, డాక్టర్లను మేకర్స్ చెడుగా చూపించే ప్రయత్నం చేశారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, సమాచార ప్రసార శాఖకు ఫిర్యాదు చేసింది. వైద్య వృత్తిలో అవినీతి సర్వసాధారణం అనేలా ఈ టీజర్ ఉందని, హెల్త్ కేర్ వర్కర్లపై హింసను ప్రేరేపిస్తోందని, దీని కారణంగా వైద్యులపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే ఆస్కారముందని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ జె నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీజర్‌పై నిష్పాక్షిక సమీక్ష జరిపి, మేకర్స్ నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా కోరారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఈ ఎదురు దెబ్బను ఊహించని దర్శక నిర్మాతలు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. అయితే ఇదంతా సమయంతో కూడుకన్న వ్యవహారం కావడంతో ముందు సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 20న ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ విడుదల కావడం లేదు. అయితే వీలైనంత త్వరగా అడ్డంకులు తొలగించుకున్నా... డిసెంబర్‌లో భారీ పాన్ ఇండియా సినిమాలు, ఆంగ్ల చిత్రాలు ఉండటంతో దీన్ని జనవరికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్న విధంగా జరిగి, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయితే, జనవరి 15న ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ను విడుదల చేయాలని భావిస్తున్నారట.

ఈ సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు రవికిషన్, ప్రగ్యా జైస్వాల్, జిష్ణుసేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. పద్మకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరో విశేషం ఏమంటే... దాదాపు 19 సంవత్సరాల తర్వాత సన్నీ డియోల్ నటించిన నాలుగు సినిమాలు ఒకే యేడాది విడుదలైనట్టయ్యింది. 2007లో సన్నీ నటించిన ‘బిగ్ బ్రదర్, ఫూల్ ఎన్ ఫైనల్, అప్నే, కాఫిలా’ సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఈ యేడాది సన్నీ డియోల్ నటించిన ‘బోర్డర్ 2, బట్వారా 1947’ థియేటర్లలో విడుదల కాగా, ‘ఇక్కా’ మూవీ డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే సన్నీ డియోల్ పూర్తి స్థాయిలో కనిపించకపోయినా సినిమా చివరిలో గ్లింప్స్ రూపంలో కనిపించిన ‘రామాయణం’ కూడా ఇదే యేడాది వచ్చింది. ఈ సినిమా ప్రచారంలోనూ సన్నీ డియోల్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సినిమా టీమ్ ఇప్పుడు ఫిర్యాదును పరిష్కరించుకుని సెన్సార్ క్లియరెన్స్ పొందేందుకు ప్రయత్నిస్తోంది. జనవరి 15న విడుదల చేసే అవకాశాలు బలంగా ఉన్నాయని సమాచారం. ప్రేక్షకులు సన్నీ డియోల్ యాక్షన్‌ను ఎంతగా ఎదురుచూస్తున్నారో, అంతగా ఈ వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది. ఐఎంఏ ఫిర్యాదు తర్వాత మేకర్స్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. సినిమా విడుదల తేదీ ఖచ్చితంగా ప్రకటించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.

Tags: