Vishal Reveals a Secret: డార్లింగ్ సీఎం విజయ్.. కాలేజీ రోజుల నాటి సీక్రెట్ బయటపెట్టిన విశాల్..
కాలేజీ రోజుల నాటి సీక్రెట్ బయటపెట్టిన విశాల్..
Vishal Reveals a Secret: కోలీవుడ్ నటుడు, నిర్మాత విశాల్.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఇటీవల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ అనంతరం విశాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సీఎం విజయ్‌ను ఉద్దేశించి డార్లింగ్ సీఎం విజయ్ అంటూ విశాల్ పెట్టిన క్యాప్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
లయోలా కాలేజ్ రోజుల నుంచే..
విజయ్‌ను తాను డార్లింగ్ అని పిలవడం వెనుక ఉన్న జ్ఞాపకాలను విశాల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. లయోలా కాలేజీలో చదువుకునే రోజుల నుంచే విజయ్‌ను తాను డార్లింగ్ అని పిలిచేవాడినని, ఇన్నేళ్లయినా, ఆయన ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా ఇప్పటికీ అదే పిలుపు కొనసాగుతోందని విశాల్ ఎమోషనల్ అయ్యారు.
నటుడి నుండి ముఖ్యమంత్రి వరకు.. అద్భుత ప్రయాణం..
విజయ్ సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఇప్పటివరకు సాగిన ఆయన ప్రయాణం తనను ఎంతగానో ఆఫ్రికేట్ చేసిందని విశాల్ కొనియాడారు. ఒక సాధారణ యువ నటుడిగా కెరీర్ ప్రారంభించి.. తమిళ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ సూపర్‌స్టార్‌గా ఎదగడం ఒక ఎత్తు. ఆ తర్వాత ప్రజల మద్దతుతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విప్లవాత్మకమైన విషయం అని పేర్కొన్నారు. ప్రయాణంలో ఎదురైన ఎన్నో విమర్శలను, సవాళ్లను విజయ్ కేవలం తన మౌనంతోనే ఎదుర్కొంటూ.. అపారమైన విజయాన్ని సాధించారని ప్రశంసించారు.
పదవి వచ్చినా మారలేదు..
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే అత్యున్నత పదవి దక్కినప్పటికీ విజయ్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని విశాల్ వెల్లడించారు. చాలా ఏళ్ల క్రితం తాము ఎలా ఆప్యాయంగా కలిసేవారో, ఇప్పుడు కూడా ఆయనలో అదే వినయం, అదే స్నేహపూర్వక అనుబంధం కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వంటి ప్రముఖ రాజకీయ నేతలతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా విశాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
బొకేలు, శాలువాలు వద్దు.. ముగ్గురు ఆడపిల్లల చదువు ముద్దు..
ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లినప్పుడు విశాల్ ఒక వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. లోకాచారంగా ఇచ్చే బొకేలు, శాలువాలకు అనవసరంగా ఖర్చు చేయకుండా.. ఆ డబ్బును ముగ్గురు నిరుపేద బాలికల విద్యా నిధి కోసం ఉపయోగించారు. ఈ ఆర్థిక సహాయాన్ని స్వయంగా సీఎం విజయ్ పేరు మీదనే ఆ బాలికలకు అందించినట్లు విశాల్ వెల్లడించారు. ఈ సాయం పొందిన బాలికలు జీవితాంతం సీఎం విజయ్‌ను గుర్తుంచుకుంటారని ఆయన చెప్పారు. విజయ్ నేతృత్వంలోని కొత్త పాలనలో తమిళనాడు రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ విశాల్ తన పోస్టును ముగించారు.