Deepika Padukone: బ్రహ్మాస్త్ర 2లో దీపికా పదుకొణె? అమృత పాత్ర కోసం సంప్రదింపులు..
అమృత పాత్ర కోసం సంప్రదింపులు..
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను సమన్వయం చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల తల్లిగా సరికొత్త బాధ్యతలు చేపట్టిన ఆమె, వరుస ప్రాజెక్టులతోనూ సందడి చేస్తున్నారు. తాజాగా ఆమె మరో భారీ ప్రాంచైజీలో భాగం కానున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన విజువల్ వండర్ బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెండో భాగం పనులు వేగవంతమయ్యాయి. ఈ సీక్వెల్‌లో అత్యంత కీలకమైన అమృత పాత్ర కోసం దీపికా పదుకొణెను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ పాత్రకు ఎంతో పరిపక్వత, గాంభీర్యం అవసరమని.. దీపిక నటనైతేనే పూర్తి న్యాయం చేస్తుందని దర్శకుడు అయాన్ ముఖర్జీ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపిక ఎంపికపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.