Deepika Padukone: నటిని కాకపోయి ఉంటే అదే చేసేదాన్ని.. దీపికా పదుకొణె మదర్‌హుడ్ కామెంట్స్ వైరల్..
దీపికా పదుకొణె మదర్‌హుడ్ కామెంట్స్ వైరల్..
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ప్రస్తుతం తన జీవితంలో ఒక అందమైన దశను అనుభవిస్తున్నారు. ఆమె రెండోసారి తల్లి కాబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతున్న వేళ, గతంలో పిల్లల గురించి ఆమె చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
నటిని కాకపోయి ఉంటే..
ఒక ఇంటర్వ్యూలో దీపికా తన వ్యక్తిగత ఆశయాల గురించి మాట్లాడుతూ.. "ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే ఏం చేసేదాన్నో తెలియదు కానీ, కచ్చితంగా నా చుట్టూ పిల్లలు ఉండి ఉండేవారు. ముగ్గురు చిన్న పిల్లలు నా చుట్టూ అటు ఇటు పరిగెత్తుతుంటే చూడాలని నా కోరిక. ఇప్పుడు కూడా నా వృత్తిని కొనసాగిస్తూనే, నా పిల్లలను షూటింగ్ సెట్స్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను" అని తన మనసులోని మాటను బయటపెట్టారు.
అంతేకాకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలోనూ తనకు పెద్ద కుటుంబం, చాలా మంది పిల్లలు, మనవరాళ్లు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ఈ పాత వీడియోలు, పోస్ట్‌లను ఆమె అభిమానులు ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు.
సినిమాలపై ఫ్యాన్స్ ఆందోళన
దీపికా గర్భవతి అనే వార్త రావడంతో, ఆమె అంగీకరించిన భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆమె రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో భాగమై ఉన్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న రాకా ప్రాజెక్టులో దీపికా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాల షూటింగ్స్ ఎప్పుడు జరుగుతాయి? దీపికా డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారు? అనే విషయాలపై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు చిత్రబృందాలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.