Kamal Haasan: కోర్టు హెచ్చరించినా..కమల్ తగ్గట్లేదు
కమల్ తగ్గట్లేదు;
Kamal Haasan: కమల్ హాసన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.కన్నడిగులకు సారీ చెప్పేది లేదని తెగేసి చెబుతున్నాడు. కమల్ హాసన్‌పై తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందనే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యల్లో దురుద్దేశ లేదన్నాడు. తన తాజా సినిమా ‘థగ్ లైఫ్’ను కర్నాటకలో విడుదల చేయబోవడం లేదని తెలిపారు. ఈ విషయంపై కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)తో చర్చలు జరుపుతానని వెల్లడించారు. కమల్ హాసన్ క్షమాపణ చెబితే వివాదం సమసిపోతుందని కర్నాటక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కమల్ హాసన్ తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై కర్నాటకలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే ‘థగ్ లైఫ్’ సినిమాను కర్నాటకలో విడుదల చేయడానికి అనుమతించబోమని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్సీసీ) హెచ్చరించింది. అలాగే, ఈ సినిమాను కర్నాటకలో నిషేధించాలని కోరుతూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కమల్ హాసన్‌పై ఫైర్ అయింది. “మీరు కమల్‌హాసన్ అయినా, ఎవరైనా సరే, ప్రజల మనోభావాలను గాయపరిచే హక్కు మీకు లేదు. ఈ దేశంలో చాలా రాష్ట్రాలు భాషల ఆధారంగా ఏర్పడ్డాయి. ఒక భాష మరో భాష నుంచి పుట్టిందని ఎలా చెప్పగలరు? మీరేమైనా చరిత్రకారులా, భాషాశాస్త్రవేత్తలా?” అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు.