Suneil Anand: దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత!

దిగ్గజ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ (Suneil Anand) లండన్‌లో గుండెపోటుతో కన్నుమూశారు.

Update: 2026-07-28 11:11 GMT

హిందీ చిత్రసీమలో దిగ్గజ నటుడిగా వెలుగొందిన దేవ్ ఆనంద్ (Dev Anand) కుమారుడు సునీల్ ఆనంద్ (Suneil Anand) కన్నుమూశారు. సోమవారం ఉదయం లండన్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతోనే ఆయన ప్రాణాలు కోల్పోయారని సమాచారం. విధి ఆడిన విచిత్రమైన నాటకం ఏమిటంటే.. 2011లో దేవ్ ఆనంద్ కూడా సరిగ్గా ఇదే లండన్ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. తండ్రి మరణించిన ప్రదేశంలోనే కొడుకు కూడా కన్నుమూయడం తీవ్ర విచారకరం. సునీల్ ఆనంద్ హఠాన్మరణంతో బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.


ప్రముఖ రచయిత్రి ధృవీకరణ

ప్రముఖ రచయిత్రి అనితా పద్దా ఈ బాధాకరమైన వార్తను మీడియాతో పంచుకుంటూ అధికారికంగా ధృవీకరించారు. సోమవారం ఉదయం సునీల్ ఆనంద్ తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు ఆమె తెలిపారు. తండ్రి దేవ్ ఆనంద్ మరణించిన తర్వాత సునీల్ లండన్‌లోనే స్థిరపడ్డారని, కుటుంబంలో ఆయన ఒక్కరే నివసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా, అనితా పద్దా గతంలో సునీల్ ఆనంద్ జీవితం ఆధారంగా 'ఎ కన్వర్జెన్స్ ఆఫ్ సాలిట్యూడ్స్' (A Convergence of Solitudes) అనే పుస్తకాన్ని కూడా రచించారు.

సునీల్ ఆనంద్ సినీ ప్రస్థానం

సునీల్ ఆనంద్ ఉన్నత విద్యను విదేశాల్లో పూర్తి చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ఉన్న 'అమెరికన్ యూనివర్సిటీ' నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు. చదువు పూర్తయిన తర్వాత తన తండ్రి దేవ్ ఆనంద్ బాటలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ రకంగా 1984లో విడుదలైన 'ఆనంద్ ఆనంద్' అనే సినిమాతో సునీల్ నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో రాఖీ, స్మితా పాటిల్, బిస్వజిత్ ఛటర్జీ వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.

తొలి సినిమా పరాజయం పాలైనప్పటికీ సునీల్ నటనను వీడలేదు. ఆ తర్వాత ఆయన 'కార్ థీఫ్', 'మై తేరే లియే', 'మాస్టర్' వంటి చిత్రాల్లో కథానాయకుడిగా, నటుడిగా కనిపించారు. అయితే, తన తండ్రి దేవ్ ఆనంద్ సాధించినంతటి నటన, ఇమేజ్, బాక్సాఫీస్ విజయాన్ని సునీల్ అందుకోలేకపోయారు.

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం

సునీల్ ఆనంద్ ప్రముఖ నటుడు దేవ్ ఆనంద్, నటి కల్పనా కార్తీక్ దంపతుల కుమారుడు. చిన్నతనం నుంచే ఆయనకు సినీ పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉంది. కేవలం తండ్రే కాకుండా ఆయన బాబాయిలు చేతన్ ఆనంద్, విజయ్ ఆనంద్ కూడా హిందీ చిత్రసీమలో అగ్రశ్రేణి దర్శకులుగా పేరు ప్రఖ్యాతలు గడించారు. 2011లో తండ్రి దేవ్ ఆనంద్ మరణించిన తర్వాత, ఆయన స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'నవకేతన్ ఫిల్మ్స్' బాధ్యతలను సునీల్ ఆనంద్ స్వీకరించి నిర్వహించారు. తండ్రి వారసత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన సునీల్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని చెప్పవచ్చు.

Tags:    

Similar News