Dhanush: తాను చదువుకున్న స్కూల్‌కు అపురూప కానుక అందించిన హీరో ధనుష్

హీరో ధనుష్

Update: 2026-08-05 07:28 GMT

Dhanush: చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు ధనుష్, తనను తీర్చిదిద్దిన పాఠశాల రుణం తీర్చుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. తాను పదో తరగతి వరకు విద్యనభ్యసించిన చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ పాఠశాలకు ఆయన ఊహించని సాయం అందించాడు. సొంత ఖర్చులతో రూపుదిద్దుకున్న మూడు అంతస్తుల నూతన భవనాన్ని స్కూల్ యాజమాన్యానికి విరాళంగా అందజేశాడు.

ధనుష్ బ్లాక్ గా నామకరణం

ధనుష్ నిర్మించి ఇచ్చిన ఈ కొత్త భవనానికి స్కూల్ యాజమాన్యం గౌరవపూర్వకంగా ధనుష్ బ్లాక్ అని పేరు పెట్టింది. ఇటీవలే జరిగిన ఈ నూతన భవన ప్రారంభోత్సవ వేడుకలో ధనుష్ తన పాఠశాల సహచరుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుమరన్‌తో కలిసి పాల్గొన్నాడు. వీరిద్దరూ 1999వ సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు కావడం విశేషం.

టీచర్ల ఆశీర్వాదం తీసుకుంటూ భావోద్వేగం:

ఈ కార్యక్రమంలో ధనుష్ తన చిన్ననాటి ఉపాధ్యాయులందరి పాదాలకు నమస్కరించి, వారి ఆశీస్సులు తీసుకున్నాడు. గురువులతో గడిపిన తీపి గుర్తుల్ని గుర్తుచేసుకుంటూ వారి తోటి ఫొటోలు దిగాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న విద్యార్థులను, ఉపాధ్యాయులను తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి.

ఇంకా భవనాలు నిర్మిస్తానని హామీ

ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కుమరన్ మాట్లాడుతూ.. పాఠశాల పాత భవనాల పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుష్ వెంటనే స్పందించి ఈ నూతన భవనాన్ని కట్టించాడని తెలిపాడు. అంతేకాకుండా, స్కూల్‌లోని పాత భవనాలను పునరుద్ధరించడంతో పాటు ఖాళీగా ఉన్న స్థలాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త తరగతి గదులను నిర్మిస్తానని ధనుష్ మాట ఇచ్చాడని వెల్లడించాడు.

ఇక ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ధనుష్ రెండు జాతీయ అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో కలిసి ఓం అనే క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు.

Tags:    

Similar News