Facts About Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఈ విషయాలు మీకు తెలుసా?;

Update: 2025-07-14 04:32 GMT

Facts About Kota Srinivasa Rao: ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం, జూలై 13, 2025న కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడాచారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగాయి.

సినిమాల్లోకి రాకముందు, కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. అయినప్పటికీ, నటనపై ఆయనకు ఉన్న అపారమైన మక్కువతో వందల సంఖ్యలో నాటకాల్లో నటించారు. రంగస్థలంపై ఆయనకు ఉన్న విశేష అనుభవం సినీ నటనకు బలమైన పునాది వేసింది. కోట శ్రీనివాసరావు 1978లో చిరంజీవి మొదటి చిత్రమైన 'ప్రాణం ఖరీదు'తో సినీ రంగ ప్రవేశం చేశారు. వీరిద్దరికీ అది తొలి చిత్రం కావడం విశేషం. సుమారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో కోట శ్రీనివాసరావు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 750కి పైగా చిత్రాలలో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు, కమెడియన్ వంటి వివిధ రకాల పాత్రల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'అహ నా పెళ్ళంట' సినిమా కోట శ్రీనివాసరావు కెరీర్‌కు ఒక మలుపు. ఈ సినిమాతో ఆయనకు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చిపడ్డాయి.

ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు, కామెడీ విలన్ రోల్స్ దక్కాయి. ఎలాంటి పాత్రలోకైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి, వర్సటైల్ యాక్టర్ అనే పదానికి అసలైన నిర్వచనంగా నిలిచారు. తన విలనీతో భయపెట్టినా, కామెడీతో నవ్వించినా, సెంటిమెంట్‌తో కంటతడి పెట్టించినా అది కోటకే చెల్లిందని చెబుతారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2015లో భారత ప్రభుత్వం దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన "పద్మశ్రీ"ని ప్రదానం చేసింది.

1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పనిచేశారు. కోట శ్రీనివాసరావు కేవలం నటుడిగానే కాకుండా, 'సిసింద్రీ' సినిమాలో 'ఓరి నాయనో', 'గబ్బర్ సింగ్' మూవీలో 'మందు బాబులం' పాటలను స్వయంగా ఆలపించారు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇది ఆయనకు తీరని లోటు. 'ప్రాణం ఖరీదు'తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కోట శ్రీనివాసరావు, 2023లో విడుదలైన 'సువర్ణ సుందరి' ఆయన చివరి చిత్రం.

Tags:    

Similar News