ఆటా ఆధ్వర్యంలో దిల్ రాజు డ్రీమ్స్ లాంచ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) జూలై 26న వర్జీనియాలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, ఆయన ప్రారంభించిన "దిల్ రాజు డ్రీమ్స్ (DRD)" ప్లాట్‌ఫారాన్ని అధికారికంగా ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించింది.
తెలుగు మరియు భారతీయ సినిమా పరిశ్రమలకు అమూల్యమైన సేవలు అందించిన ప్రఖ్యాత నిర్మాత,తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు గారిని, డీసీ ప్రాంతంలోని తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఆదరభిమానాలతో స్వాగతించారు.
"దిల్ రాజు డ్రీమ్స్" అనేది సినిమా రంగంలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకునే కొత్త ప్రతిభావంతుల కోసం ఒక గొప్ప వేదిక. నిర్మాత, రచయిత, దర్శకుడు, నటుడు, గాయకుడు, సినిమాటోగ్రాఫర్ లేదా ఇతర సినీరంగాలలో ప్రవేశించాలనుకునే 250 మందికి పైగా వ్యక్తులు ఈ కార్యక్రమానికి నమోదయ్యారు.
ATA అధ్యక్షుడు జయంత్ చల్లా గారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రామ్ మట్టపల్లి, విష్ణు మాధవరం, శ్రీధర్ బాణాల గార్లు కలిసి దిల్ రాజు గారు మరియు ఆయన భార్య తేజస్వినీ గారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని మహేష్ కేసిరెడ్డి గారి సహకారం తో ATA ప్రాంతీయ సమన్వయకర్తలు, స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లు మరియు సభ్యులు — జీనత్ కుందూరు, వేణు నక్షత్రం, అనిల్ బోయినపల్లి, రమేష్ భీంరెడ్డి, రాజశేఖర్ ,ఇంకా పలువురు కార్యకర్తల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.
ఆటా ఆహ్వానానికి వెంటనే స్పందించి అమెరికా లో తెలుగు సినిమా ఎన్నారై ఔత్సాహితులకోసం ఏర్పాటు చేసిన దిల్ రాజు డ్రీమ్స్ కార్యక్రమాన్ని ఆటా ద్వారా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఎందరో ఎన్నారైలు ఈ వేదిక ద్వారా సినిమాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించగలరనే ఆశాభావాన్ని వ్యక్రపరిచారు ఆటా అధ్యక్షులు శ్రీ జయంత్ చల్లా గారు. పలువురు తెలుగు ఎన్నారై లను ప్రోత్సహించే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆటా ద్వారా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శ్రీ జయంత్. తెలుగు ఎన్నారయిలకు ఉపయోగపడే ఎలాంటి సేవలకు అయినా అమెరిలాన్ తెలుగు అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు శ్రీ జయంత్.
ఈ సందర్భంగా దిల్ రాజు గారు, DRD ప్లాట్‌ఫారం ఎలా పనిచేస్తుందో, మరియు దానితో ఎలా పని చేయవచ్చో వివరంగా ప్రెజంటేషన్ ద్వారా తెలియజేశారు.
తేజస్వినీ గారు సినిమా నిర్మాణాన్ని వేగవంతం చేయడం మరియు నాణ్యతను మెరుగుపర్చడం కోసం రూపొందించిన AI ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు.
ఆ తర్వాత సుధీర్గంగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం లో
పలువురు ఔత్సాహిక సభ్యులు అడిగిన ప్రశ్నలకి
దిల్ రాజు గారు చాలా ఓపికగా వివరాత్మక జవాబులు ఇచ్చారు.
ప్రశ్నోత్తర కార్యక్రమం – హైలైట్స్:
సభలో పాల్గొన్న ప్రేక్షకులు దిల్ రాజు గారిని, తేజస్వినీ గారిని వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి జవాబులు పొందారు. ఈ ప్రశ్నోత్తర కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.
✅ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు & జవాబులు:
ప్రశ్న: “Dil Raju Dreams ద్వారా కొత్తవాళ్లు సినిమాలలో ఎలా అవకాశం పొందగలరు?” జవాబు – దిల్ రాజు గారు: "మా ప్లాట్‌ఫారమ్ కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఏర్పాటైంది. మీరు స్క్రిప్ట్‌లు, ప్రాజెక్ట్ ఐడియాలు పంపించవచ్చు. జ్యూరీ సభ్యుల ద్వారా ఎంపికైన ప్రాజెక్టులకు మేము మార్గనిర్దేశనం, మార్గదర్శకత్వం, అవసరమైన మద్దతును అందిస్తాము."
ప్రశ్న: "ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎవరైనా చేరవచ్చా? ఏవైనా అర్హతలు ఉన్నాయా?" జవాబు – దిల్ రాజు గారు: "ఈ ప్లాట్‌ఫారమ్ అందరికీ ఓపెన్. మీకు సినిమాపై ఆసక్తి ఉంటే, మీ కలను నిజం చేసుకునే వేదికగా ఇది నిలుస్తుంది."
ప్రశ్న: "AI టూల్ సినిమాల్లో ఎలా సహాయపడుతుంది?" జవాబు – తేజస్వినీ గారు: "ఈ AI టూల్ ద్వారా స్క్రిప్ట్‌లను త్వరగా తయారుచేయడం, విజువల్ ప్రివ్యూస్ తయారు చేయడం, షూటింగ్ సమయంలో సమయం మరియు ఖర్చు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇది సినిమా నాణ్యతను పెంచడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది."
ప్రశ్న: "మీరు కొత్త దర్శకులను ఎలా ఎంపిక చేస్తారు?" జవాబు – దిల్ రాజు గారు: "మేము వారి ప్రాజెక్ట్ విజన్ ను, ప్రతిభను, స్క్రిప్ట్ బలాన్ని బట్టి ఎంపిక చేస్తాము. ఒకసారి మీ పనితీరు నచ్చితే, మేమే మీతో కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటాము."
ఇలా ప్రశ్నోత్తర కార్యక్రమం ద్వారా పాల్గొన్నవారికి చక్కటి స్పష్టత లభించడంతో పాటు, DRD ప్రాజెక్టుపై ఎంతో ఆసక్తి ఏర్పడింది