Donations in NTR’s Name: ఎన్టీఆర్ పేరుతో సాగుతున్న అనధికారిక విరాళాల సేకరణపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. దీనికి సంబంధించి మే 13న ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ, అటువంటి కార్యక్రమాలకు ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

కొంతమంది అభిమాన సంఘాల పేరుతో ఎన్టీఆర్ మార్కును వాడుకుంటూ ఛారిటీ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటితో తమకు గానీ, ఎన్టీఆర్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. "మిస్టర్ ఎన్టీఆర్ పేరుతో విరాళాలు సేకరిస్తున్న ఏ కార్యక్రమాన్నీ ఆయన ఆమోదించలేదు. ప్రజలు, అభిమానులు ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి" అని ఎన్టీఆర్ టీమ్ హెచ్చరించింది.

ఎవరైనా ఎన్టీఆర్ పేరు చెప్పి డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఆయన చేసే ఏ అధికారిక సామాజిక కార్యక్రమమైనా నేరుగా ఆయన కార్యాలయం నుంచే వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చారు. మోసపూరిత ప్రకటనలకు లొంగిపోయి ఎవరూ డబ్బులు నష్టపోవద్దని విన్నవించారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ బర్త్ డే ఫీవర్ మొదలైన వేళ ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాకు సంబంధించిన చిన్న గ్లింప్స్ మే 19న విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఉత్సాహంలో ఉన్న అభిమానులను అప్రమత్తం చేసేందుకే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags: