Grand ‘Virosh’ Wedding: వైభవంగా విరోష్ కళ్యాణం..విజయ్ ఎమోషనల్ నోట్
విజయ్ ఎమోషనల్ నోట్
Grand ‘Virosh’ Wedding: తెలుగు తెరపై ‘గీత గోవిందం’గా అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట నిజ జీవితంలోనూ ఏడడుగులు వేసింది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ గురువారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వివాహ బంధంతో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. అక్కడి 'మొమెంటోస్ బై ఐటీసీ' రిసార్ట్స్‌లో అత్యంత వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఉదయం 10:10 గంటలకు తెలుగు సంప్రదాయం ప్రకారం రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడు. సాయంత్రం రష్మిక పుట్టినింటి ఆచారమైన 'కొడవ' సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం సరదాగా సాగింది. వివాహానికి ముందు సంగీత్, మెహందీ వేడుకలతో పాటు 'విరోష్ ప్రీమియర్ లీగ్' పేరుతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, హీరోయిన్స్ ఈషా రెబ్బా, ఆషిక రంగనాథ్ తదితరులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ జంటకు లెటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో వెండితెరపై మెప్పించిన ఈ జోడీ, ఇప్పుడు నిజ జీవితంలోనూ జంటగా మారిన క్రమంలో అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయ్ ఎమోషనల్ నోట్
వెడ్డింగ్ ఫొటోస్‌తో పాటు విజయ్ షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘‘ఒకరోజు ఆమె లేని వెలితి నాకు స్పష్టంగా తెలిసింది. తను ఎదురుగా ఉంటే భోజనం తృప్తిగా ఉంటుందని, తను పక్కన ఉంటే నా రోజంతా బాగుంటుందని అనిపించింది. వర్కవుట్స్ కూడా శిక్షలా కాకుండా సరదాగా సాగుతాయని అర్థమైంది. నేను ఎక్కడున్నా సరే.. మనశ్శాంతిని, ఇంటి ఫీలింగ్‌ను ఇచ్చే వ్యక్తి ఆమె. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా చేసుకున్నాను”అంటూ ఈ నోట్‌లో రష్మిక పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు విజయ్.
మార్చి 4న రిసెప్షన్
అతికొద్దిమంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న విజయ్, రష్మిక.. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు పలువురు సినీ సెలెబ్రిటీస్ ఈ వేడుకకు హాజరు కానున్నారు.