DV4 Controversy: హీరో ఆగస్టు 10న తప్పక హాజరుకావాలి

నీలాద్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'డీవీ4' సినిమా వివాదంపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ తీవ్రంగా స్పందించింది.

Update: 2026-07-31 13:14 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'డీవీ4' (DV4) సినిమా వివాదం అత్యంత తీవ్రరూపం దాల్చింది. ఈ వివాదంపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SIFCC) చాలా సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి జూలై 30న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి నీలాద్రి ప్రొడక్షన్స్ నుంచి డీవీ4 నిర్మాత హాజరుకాగా, ధృవ్ కృష్ణ గైర్హాజరయ్యారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రి... ఛాంబర్ కార్యదర్శి కృష్ణారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.

ఛాంబర్ కఠిన నిర్ణయాలు:

ఈ వివాదంపై ఎస్ఐఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ స్పందిస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఛాంబర్ కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ హీరో నటించే ఏ కొత్త సినిమా కూడా ముందుకు వెళ్లకూడదని మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొదట నీలాద్రి ప్రొడక్షన్స్ ప్రారంభించిన 'డీవీ4' ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే నైతిక ధర్మమని ఛాంబర్ అభిప్రాయపడింది. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేశారని, ఈ సమస్య తేలే వరకు ఎలాంటి టీజర్లు, ప్రమోషనల్ మెటీరియల్ లేదా సినిమా విడుదల చేయకూడదని అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఛాంబర్ సమన్లు:

ఈ వివాదంపై నిర్మాత అధికారికంగా ఫిర్యాదు చేయడంతో, ఈ హీరో ఆగస్టు 10న నేరుగా ఛాంబర్ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఎలాంటి ప్రతినిధులను పంపడానికి వీలేదని, హీరో స్వయంగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్మాతకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఆరోగ్య సమస్యల పేరుతో షూటింగ్‌కు తేదీలు కేటాయించకుండా హీరో మధ్యలోనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం సరైన పద్ధతి కాదని ఛాంబర్ పేర్కొంది.


అలాగే డీవీ4 టైటిల్ విషయంలోనూ స్పష్టత లేదని, నీలాద్రి ప్రొడక్షన్స్ ఇప్పటికే ఈ టైటిల్‌తో సినిమాను లాంచ్ చేసినందున, వేరే బ్యానర్‌లో వచ్చే చిత్రం డీవీ5 అవుతుంది. కానీ డీవీ4 కాదని ఛాంబర్ తేల్చిచెప్పింది. రూ.20 కోట్ల భారీ పెట్టుబడితో ముడిపడి ఉన్న ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరించాలని ఛాంబర్ భావిస్తోంది.

Tags:    

Similar News