'Hanuman Ansh': రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.452 కోట్ల వసూళ్లు.. అయినా బాలీవుడ్ స్టూడియోల మౌనంపై దర్శకుడి ఆవేదన
| దర్శకుడి ఆవేదన
'Hanuman Ansh': ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా (నీబ్ కరోరి బాబా) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిన్న సినిమా ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్‌ను తలకిందులు చేసింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తయారైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.452.86 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. తొలి సినిమాతోనే ఈ అద్భుత విజయాన్ని అందుకున్న దర్శకుడు విశాల్ చతుర్వేది ఇప్పుడు బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థల మౌనంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరో, వందల కోట్ల బడ్జెట్, పెద్ద బ్యానర్ అండదండలు ఉండాలనే పాత లెక్కలను ఈ చిత్రం పూర్తిగా తలకిందులు చేసింది. థియేటర్ ఈవెంట్ ప్లేస్‌గా మాత్రమే పని చేస్తుందని, పెద్ద సినిమాలే విజయం సాధిస్తాయని ఇండస్ట్రీలో వినిపించే మాటలను ఈ చిత్రం తప్పు నిరూపించిందని విశాల్ అన్నారు. “సినిమా ప్రజల మాధ్యమం. మంచి కథ ఉంటే చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేయగలవు. సినిమా బాగుందో లేదో నిర్ణయించేది ప్రేక్షకులే, విమర్శకులు లేదా సోషల్ మీడియా కాదు” అని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఇంతటి ఘన విజయం సాధించినా బాలీవుడ్‌లోని పెద్ద నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ప్రశంసలు లేదా స్టేట్‌మెంట్లు రాకపోవడం ఆయన్ను ఆశ్చర్యపరిచింది. “పెద్ద సినిమా విజయం సాధిస్తే నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటనలు చేస్తుంటాయి. కానీ మా చిత్రం చిన్నది, నేను తొలి డైరెక్టర్ కావడంతో ఏ ఒక్క పెద్ద సంస్థ నుంచీ స్టేట్‌మెంట్ రాలేదు. ఇది నిజంగా ఆశ్చర్యకరం” అని విశాల్ చతుర్వేది ఇటీవల ఇంటర్వ్యూలో అన్నారు.
వ్యక్తిగతంగా కలిసిన వారు సినిమాను బాగా ప్రశంసిస్తున్నారని, అయితే బహిరంగంగా ప్రశంసించినవారు కొందరేనని ఆయన తెలిపారు. నటుడు వరుణ్ ధావన్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖులు మాత్రం సినిమాను బహిరంగంగా మెచ్చుకున్నారు. “పెద్ద హృదయం ఉన్న కొందరు మాత్రమే బయటకు ప్రశంసించారు. ఏ పెద్ద స్టూడియో లేదా ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ హౌస్ లేఖ లేదా స్టేట్‌మెంట్ ఇవ్వలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ బడ్జెట్ సినిమాలపై కూడా విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.200 కోట్లు పెట్టి కనీసం రూ.400 కోట్లు రాబట్టలేకపోతే అది ఫ్లాప్‌గా ముద్రపడుతుందని, నిర్మాతలు పెట్టుబడి-రాబడి లెక్కలను ముందే చూసుకోవాలని సూచించారు. నితీశ్ తివారీ దర్శకత్వంలోని భారీ బడ్జెట్ ‘రామాయణ’ చిత్రాన్ని చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, అయితే ఇంకా సమయం దొరకలేదని తెలిపారు.
‘హనుమాన్ అంశ్’ సీక్వెల్‌పై కూడా ఆయన అప్‌డేట్ ఇచ్చారు. నిర్మాతల మధ్య విభేదాల కారణంగా రెండో భాగం ప్రస్తుతం నిలిచిపోయింది. నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రానికి ఓటీటీలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూసి తర్వాతే సీక్వెల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని విశాల్ అన్నారు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిన్న సినిమా ఓటీటీలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శోభినావ్ సత్యా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2026లో అతిపెద్ద సర్ప్రైజ్ హిట్‌గా నిలిచింది. చిన్న సినిమాల విజయాన్ని కూడా ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవాలని విశాల్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని ఆదరించి బాక్సాఫీస్ రికార్డులు సృష్టించారు.