‘Vishnu Vinyasam’ Teaser: శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ చూశారా!
టీజర్ చూశారా!
‘Vishnu Vinyasam’ Teaser: వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు, మరోసారి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. శ్రీవిష్ణు, నయనా సారిక జంటగా నటించిన “విష్ణు విన్యాసం” చిత్ర టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకే రోజు వ్యవధిలో తన రెండు సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న శ్రీవిష్ణు, ఆ సినిమాల్లో ఒకటిగా ‘విష్ణు విన్యాసం’ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
టీజర్ విషయానికొస్తే.. ఇది ఒక కారులో హీరో హీరోయిన్ల మధ్య జరిగే సరదా సంభాషణతో మొదలవుతుంది. నయనా సారిక డ్రింక్ ప్రిపేర్ చేస్తూ ఉండగా, వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం కనిపిస్తుంది. ఆ తర్వాత హీరో క్యారెక్టరైజేషన్‌ను పరిచయం చేశారు. ఎవరితోనూ సంబంధం లేకుండా, తన ప్రపంచంలో తాను ఉంటూ, తన ఇష్టానుసారం బ్రతికే ఒక విలక్షణమైన వ్యక్తిగా శ్రీవిష్ణు పాత్రను మలిచారు. టీజర్‌లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది.
అయితే, ఈ ప్రేమకథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. హీరోయిన్ తన ప్రియుడైన హీరోనే ఒక "మంచి అబ్బాయిని" చూసి తనకు పెళ్లి సంబంధం కుదర్చమని అడగడం. ఈ ఒక్క పాయింట్ కథపై ఆసక్తిని పెంచడమే కాకుండా, ఇది ఒక "టిపికల్ లవ్ స్టోరీ కాదు" అనే క్లారిటీని ఇచ్చింది. 'ఆయ్' సినిమాతో మెప్పించిన నయనా సారిక, శ్రీవిష్ణుకి జోడీగా బాగా సెట్ అయింది.
కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించగా, సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. రాధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న థియేటర్లలో సందడి చేయనుంది.