Himaja Fires Back: హిమజ ఫైర్.. నా కష్టం చూడరా? నా కారు, ఇల్లు చూసి ఏడుస్తారేంటి..
నా కారు, ఇల్లు చూసి ఏడుస్తారేంటి..
Himaja Fires Back: బిగ్‌బాస్ ఫేమ్, నటి హిమజ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఉగ్రరూపం దాల్చారు. తన లగ్జరీ లైఫ్ స్టైల్, సంపాదనపై కొందరు నెటిజన్లు చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు ఆమె ధీటుగా సమాధానమిచ్చారు. ఒక తెలుగమ్మాయి కష్టపడి పైకి ఎదుగుతుంటే అభినందించాల్సింది పోయి, క్యారెక్టర్‌పై పడి ఏడవడం ఏంటని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
నా లగ్జరీ వెనుక రాత్రింబవళ్ల శ్రమ ఉంది!
తాను అనుభవిస్తున్న ఈ విలాసవంతమైన జీవితం ఊరికే రాలేదని, దీని వెనుక ఎంతో కష్టం ఉందని హిమజ స్పష్టం చేశారు. బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చాక దాదాపు 12 షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నానని, ఒక్కో ఓపెనింగ్‌కు వచ్చే పారితోషికమే తను వాడుతున్న కారు కొనడానికి సరిపోతుందని ఘాటుగా సమాధానమిచ్చారు. కేవలం నటన మాత్రమే కాకుండా, హెర్బాలైఫ్ సూపర్‌వైజర్‌గా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా రాణిస్తూ, సొంతంగా ఒక కంపెనీని కూడా నడుపుతున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇంటి ఈఎంఐ పేపర్లు చూపించమంటారా?
ముఖ్యంగా తన విలాసవంతమైన ఇల్లు ఎవరో గిఫ్ట్ ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై హిమజ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆ ఇల్లు కొనడానికి నా తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా ఎంతో సాయం చేశారు. అది తెలియకుండా ఇలాంటి కామెంట్స్ చేస్తే వారి మనసు ముక్కలవుతుంది. అవసరమైతే నా ఇంటి EMI పేపర్లు కూడా చూపిస్తాను" అని ఆమె సవాల్ విసిరారు.
హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవు..
ఎదుటివారి ఎదుగుదలను చూసి అసూయ పడటం మానుకోవాలని హితవు పలికిన హిమజ, ఇకపై ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అసభ్యకరమైన కామెంట్స్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.