Malavika Mohanan: త్రిష చేసిన ఆ ఒక్క మెసేజ్ మర్చిపోలేను.. హీరోయిన్ మాళవికా మోహనన్ ఎమోషనల్
హీరోయిన్ మాళవికా మోహనన్ ఎమోషనల్
Malavika Mohanan: స్టార్ హీరోయిన్ త్రిష వ్యక్తిత్వం, ఆమె పెద్ద మనసు గురించి నటి మాళవికా మోహనన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ రంగంలో కొత్తగా అడుగుపెట్టే వారిని ఆదరించి, ప్రోత్సహించే గుణం త్రిషలో మెండుగా ఉందని కొనియాడారు. కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న మాళవిక.. తన కెరీర్ ప్రారంభంలో త్రిషతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలు విశేషాలు వెల్లడించారు.
భయాన్ని పోగొట్టి వెన్నుతట్టిన త్రిష
తన కెరీర్ తొలినాళ్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాలో అవకాశం రావడంపై మాళవిక స్పందిస్తూ.. "అంత పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్ చేసే అనుభవం లేకపోవడంతో ఆ సమయంలో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను. వారణాసిలో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో త్రిషతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆమె నన్ను ఎంతగానో ఆదరించారు. ప్రతీ విషయంలో నాకు తోడుగా నిలిచి కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకున్నారు. పరిశ్రమలో చాలామంది తమ పని అయిపోగానే వెళ్లిపోతుంటారు, కానీ త్రిష మాత్రం కొత్త వాళ్లను కూడా సొంత మనుషుల్లా చూసుకుంటారు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు" అని తెలిపారు.
మాస్టర్ అవకాశం వచ్చినప్పుడు ప్రత్యేకంగా మెసేజ్..
ఆ తర్వాత దళపతి విజయ్ సరసన మాస్టర్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కినప్పుడు కూడా త్రిష ఎంతో గొప్పగా స్పందించారని మాళవిక గుర్తుచేసుకున్నారు. "మాస్టర్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెంటనే త్రిష నాకు ప్రత్యేకంగా మెసేజ్ పంపించారు. బేబీ.. ఇంత పెద్ద సినిమాలో నీకు అవకాశం రావడం చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. సినిమా ఘన విజయం సాధించాలి అంటూ విష్ చేశారు. పోటీ ఉండే ఈ పరిశ్రమలో మరో నటి ఎదుగుదలను చూసి మనస్ఫూర్తిగా అభినందించడానికి ఎంతో పెద్ద మనసు కావాలి" అంటూ త్రిషపై ప్రశంసల జల్లు కురిపించారు.
కాగా విజయ్-మాళవిక కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాళవిక నటించిన తాజా చిత్రం సర్దార్ 2 సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.