NTR: నువ్వు దూరమవ్వడం భరించలేకపోతున్నా.. బాగీరా మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
బాగీరా మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తీవ్రమైన వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొంటున్నారు. తారక్ తన ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పెంపుడు కుక్క 'బాగీరా' కన్నుమూసింది. గత నాలుగు సంవత్సరాలుగా తన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్న బాగీరా దూరమవ్వడంతో తారక్ తీవ్ర ఆవేదన చెందారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న భావోద్వేగ సందేశం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
నువ్వు నా జీవితంలోకి ఒక తోడుగా వచ్చావు... కానీ ఎప్పుడూ తెలియకుండానే నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు' అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రేమ, విధేయత, అల్లరితో తన రోజులను అందంగా మార్చిన బాగీరా లేని లోటు ఎంతో పెద్ద శూన్యతను మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'నన్ను ఎంచుకున్నందుకు, నాతో నడిచినందుకు ధన్యవాదాలు బాగీరా... నువ్వు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటావు, రెస్ట్ ఇన్ పీస్ మై లిటిల్ వన్' అంటూ ఆయన వీడ్కోలు పలికారు.బాగీరాతో తాను గడిపిన మధురమైన జ్ఞాపకాలను, ఫోటోలను తారక్ షేర్ చేయగా... అందులో చివరి ఫోటో అందరినీ కలచివేస్తోంది.
బాగీరా సమాధిపై తారక్ స్వయంగా ఒక చిన్న మొక్కను నాటి, తన ప్రేమను చాటుకున్నారు.ఇటీవల భుజానికి అయిన గాయంతో సర్జరీ బారిన పడి కోలుకుంటున్న తారక్‌కు, ఈ పెంపుడు మూగజీవి మరణం మరింత వేదనను మిగిల్చింది. ఈ కష్టకాలంలో ఎన్టీఆర్‌కు ఆయన అభిమానులు, తోటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మూగజీవులపై అపారమైన ప్రేమను చూపే తారక్ గుండె కోతను చూసి నెటిజన్లు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.