Tamannaah's Shocking Remarks: కావాలయ్యా డ్యాన్స్ నాకు నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్.. అవాక్కవుతున్న ఫ్యాన్స్..
అవాక్కవుతున్న ఫ్యాన్స్..
Tamannaah's Shocking Remarks: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రం జైలర్. ఈ సినిమాలో వచ్చిన నువ్వు కావాలయ్యా సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులోని తమన్నా సిగ్నేచర్ స్టెప్పులు, అదిరిపోయే మూవ్స్‌కు థియేటర్లలో ఆడియన్స్ ఊగిపోయారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఈ పాటకు రీల్స్ చేసి ట్రెండ్ చేశారు. అయితే, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ పాటలో.. తన పెర్ఫార్మెన్స్ పట్ల తాను అస్సలు సంతృప్తిగా లేనని తమన్నా తాజాగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఫరా ఖాన్ వ్లాగ్‌లో అసలు నిజం రివీల్..
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్ కోసం ముంబైలోని తమన్నా నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ సరదాగా ముచ్చటిస్తూ తమన్నా కెరీర్‌లోని బెస్ట్ సాంగ్స్ గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే కావాలయ్యా పాట ప్రస్తావన వచ్చింది.
అప్పుడు తమన్నా మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే, ఆ పాట షూటింగ్ పూర్తయిన తర్వాత నా నటనపై నాకే కొంచెం అసంతృప్తిగా అనిపించింది. నేను ఇంకా మెరుగ్గా చేసి ఉండాల్సింది. ఆ అవుట్‌పుట్ చూశాక నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ కలగలేదు" అని తన మనసులోని మాటను బయటపెట్టారు. దీనికి ఫరా ఖాన్ స్పందిస్తూ.. "నువ్వు ఎప్పుడూ నీ పనిలో పర్‌ఫెక్షన్ కోరుకుంటావు. ఇంకా బాగా చేయొచ్చు అని భావించే రకం నువ్వు" అంటూ తమన్నాను ప్రశంసించారు.
నేను ట్రైన్డ్ డ్యాన్సర్‌ని కాదు..
తాను పుట్టుకతోనే శిక్షణ పొందిన డ్యాన్సర్‌ని కాదని తమన్నా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "నేను ఒక పాట కోసం చాలా హోమ్‌వర్క్ చేస్తాను. బాలీవుడ్‌లో నేను చేసిన ఆజ్ కీ రాత్ అనే స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా 15 రోజుల పాటు కష్టపడి రిహార్సల్స్ చేశాను. ప్రతి పాటకు అంత సమయం కేటాయించాలని, పర్‌ఫెక్ట్‌గా చేయాలని నేను కోరుకుంటాను" అని తమన్నా వివరించారు.
కాగా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించిన కావాలయ్యా పాటకు తెలుగులో శ్రీసాయి కిరణ్ లిరిక్స్ రాయగా.. సింధుజా శ్రీనివాసన్, అనిరుధ్ కలిసి ఆలపించారు.
క్రేజీ ప్రాజెక్టులతో తమన్నా బిజీ..
తమన్నా ప్రస్తుతం అటు సౌత్‌తో పాటు ఇటు బాలీవుడ్‌లోనూ వరుస క్రేజీ ప్రాజెక్టులతో డైరీ ఫుల్ చేసుకున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వ్వాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాగిణి 3 అనే మోస్ట్ అవేటెడ్ హారర్ చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.