Natural Star Nani: మాస్ హీరోల పరిస్థితి చూస్తే జాలేస్తుంది.. ఇమేజ్‌పై నాని సంచలన వ్యాఖ్యలు..
నాని సంచలన వ్యాఖ్యలు..
Natural Star Nani: నేచురల్ స్టార్ నాని ఇటీవల ది ప్యారడైజ్ వంటి భారీ యాక్షన్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నారు. ఈ స్థాయిలో మాస్ యాక్షన్ హిట్ కొట్టిన తర్వాత సాధారణంగా ఏ హీరో అయినా కమర్షియల్, మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలని చూస్తారు. కానీ నాని మాత్రం తనకు అలాంటి ‘మాస్ హీరో’ ట్యాగ్‌లపై ఎలాంటి మోజు లేదని కుండబద్దలు కొట్టారు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ 'హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్, ఒత్తిడి, తన రాబోయే ప్రాజెక్టులపై ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ఆ హీరోలను చూస్తే జాలేస్తుంది..
మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడే ధోరణిపై నాని స్పందిస్తూ.. "ఒకసారి మాస్ హీరో ట్యాగ్ పడితే దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ ఉండే నటులను చూస్తే నాకు నిజంగా జాలేస్తుంది. ఆ ఇమేజ్ తెచ్చే ఒత్తిడి మామూలుగా ఉండదు. అలాంటి వాళ్లు ప్రతిసారీ కేవలం భారీ చిత్రాలే చేయాల్సి వస్తుంది. ఎన్నో బాక్సాఫీస్ లెక్కలు వేసుకోవాలి.. దాంతో మనసుకు నచ్చిన విభిన్న కథలను ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా కోల్పోతారు. అలాంటి ఇమేజ్ భారాన్ని నేను ఏ రోజూ మోయాలనుకోవడం లేదు" అని కుండబద్దలు కొట్టారు.
కథల ఎంపికే నా సమాధానం: నాని
తాను ఎప్పుడూ ఒకే తరహా జోనర్‌కు పరిమితం కాలేదని గుర్తుచేస్తూ.. "నా గత చిత్రాల ఎంపికను చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఊరమాస్ చిత్రంగా వచ్చిన ‘దసరా’ తర్వాత వెంటనే పూర్తి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న చేశాను. ఇప్పుడు బ్లడీ రోమియో తర్వాత కూడా ఒక సున్నితమైన ప్రేమకథా చిత్రాన్ని లైన్‌లో పెట్టాను. నాకు ‘ది ప్యారడైజ్’ కంటే పెద్ద, భారీ బడ్జెట్ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకే రకమైన మూస పాత్రలకు పరిమితం కాకుండా, ప్రతిసారీ వైవిధ్యాన్ని చూపించడమే నాకు ఇష్టం" అని వివరించారు.
ఇంతకంటే పెద్ద స్టార్ అవ్వాలనే ఆశ లేదు
తన కెరీర్ సంతృప్తిపై నాని మాట్లాడుతూ.. "తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను ఉన్న స్థానం పట్ల పూర్తి తృప్తితో, సంతోషంగా ఉన్నాను. ఇంతకంటే పెద్ద స్టార్ అయిపోవాలనే అత్యాశ నాకు అస్సలు లేదు. బాక్సాఫీస్ ఓపెనింగ్స్, చుట్టూ ఉండే ఇమేజ్ కంటే.. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే మంచి కథలు చేయడానికే నేను ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తాను" అని స్పష్టం చేశారు