Samantha Opens Up: ఈ మూవీ కోసం దెబ్బలు తిన్నా.. రక్తం వచ్చింది: సమంత
సమంత
Samantha Opens Up: సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమంత.. కేవలం నటిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా మారి నిర్మించిన సరికొత్త చిత్రం మా ఇంటి బంగారం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన సామ్.. ఈ చిత్రంలో తాను పోషించిన స్వర్ణ పాత్రపై తనకున్న ప్రేమను బయటపెట్టారు.
నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు అత్యంత దగ్గరగా..
ఈ సినిమాలో తన పాత్రకు అంతగా ఎందుకు కనెక్ట్ అయ్యారో సమంత వివరించారు. "స్వర్ణ పాత్రలో ఉన్న దృఢ సంకల్పం అనే ఒక్క లక్షణం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్‌తో నేను పూర్తిగా ప్రేమలో పడిపోయాను" అని చెప్పారు. అంతేకాదు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "ఇంతవరకు నేను తెలుగు సినీ కెరీర్‌లో పోషించిన పాత్రలన్నింటిలోకీ, నా నిజ స్వరూపానికి అత్యంత దగ్గరగా, నా లాగే ఉండే పాత్ర స్వర్ణ మాత్రమే" అని సమంత పేర్కొనడం విశేషం. దీంతో సమంత నిజ జీవిత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ పాత్ర ఉండబోతోందని స్పష్టమైంది.
డూప్ లేకుండా రియల్ ఫైట్స్.. దెబ్బలు తగిలాయి, రక్తం వచ్చింది..
ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ గురించి మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. "ఈ సినిమాలో కమర్షియల్ సినిమాల్లో లాగా ఎక్కడా స్లో మోషన్ షాట్స్, కృత్రిమ బిల్డప్ షాట్స్ ఉండవు. యాక్షన్ సన్నివేశాలన్నీ చాలా రియలిస్టిక్‌గా, సహజంగా ఉంటాయి. సినిమాలో కనిపించేవన్నీ నిజమైన పంచులు. వాటి చిత్రీకరణ సమయంలో నేను డూప్స్ ఎవరినీ పెట్టుకోలేదు, అన్ని సీన్స్ నేనే స్వయంగా చేశాను. ఆ క్రమంలో నాకు నిజంగానే దెబ్బలు తగిలాయి, రక్తం కూడా వచ్చింది. ఆ కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది కాబట్టే ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ అవుతోంది" అని సామ్ వివరించారు.
కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తా..
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను రేపింది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత తన ప్రియుడి ఇంటికి వచ్చిన స్వర్ణకు సమాజం నుండి, కుటుంబం నుండి కులం, వంట, తోబుట్టువుల గురించి రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. వాటన్నింటికీ ఆమె "నేనెవరో మీకు తెలుసా?" అని తిప్పికొట్టే విధానం థ్రిల్ కలిగిస్తుంది.
ముఖ్యంగా.. "కోడలికి అందం ఉండాలి, సన్నగా ఉండాలి, వంట చేయాలి అని ఆశిస్తారు.. కానీ నాలో ఆ లక్షణాలు ఏవీ లేవు. నాలో ఒకే ఒక్క గుణం ఉంది.. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను" అని సమంత చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్, ఈ సినిమా కథాంశాన్ని, ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసాన్ని కళ్లకడుతోంది. వన్‌మెన్ షోగా సమంత నటించిన ఈ లేటెస్ట్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.