Aamir’s Shocking Comments: ఆ సినిమా వల్ల రూ.200 కోట్లు నష్టపోయా.. అమీర్ సంచలన వ్యాఖ్యలు
అమీర్ సంచలన వ్యాఖ్యలు
Aamir’s Shocking Comments: తాను నిర్మించే సినిమాల బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని, అయితే లాల్ సింగ్ చడ్డా చిత్రం విషయంలో అతి నమ్మకంతో ముందుకు వెళ్లడం వల్ల భారీగా నష్టపోయానని బాలీవుడ్ స్టార్ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. ఈ సినిమా తనకు ఏకంగా రూ.200 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ఆశించినంతగా 'లాల్ సింగ్ చడ్డా' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని ఆయన ఒప్పుకున్నారు.
అతి నమ్మకంతో దెబ్బతిన్నా
నిర్మాతగా నా తొలి ప్రాధాన్యత సినిమా వల్ల నష్టాలు రాకుండా చూడటమే. కథకు అవసరమైనంత బడ్జెట్‌ను మాత్రమే ఖర్చు చేస్తా. కానీ, 'లాల్ సింగ్ చడ్డా' విషయంలో నా అతినమ్మకం అంచనాలను దెబ్బతీసింది. అంతకుముందు నా సినిమాలన్నీ హిట్ కావడంతో, ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని గట్టిగా నమ్మాను. కానీ, నా అంచనా తప్పింది. బడ్జెట్ విషయంలో పరిమితి పాటించకపోవడం వల్ల రూ.200 కోట్లు నష్టపోయాను" అని ఆమిర్ వివరించారు.
కరోనా ప్రభావం, అనవసర ఖర్చులు
దంగల్ సినిమా ఇండియాలో రూ.385 కోట్లు వసూలు చేయడంతో లాల్ సింగ్ చడ్డా కనీసం రూ.100 నుంచి 200 కోట్లు సాధిస్తుందని ఆశించినట్లు ఆమిర్ తెలిపారు. ఈ అంచనాలతోనే బడ్జెట్‌ను ప్రణాళిక చేసుకున్నానని చెప్పారు. అయితే, కరోనా ఆంక్షల కారణంగా విదేశాల్లో షూటింగ్‌లు చేయాల్సి రావడంతో ప్రయాణాలకు అధిక ఖర్చు అయిందని పేర్కొన్నారు.
మరింతగా చైనాలో చిత్రీకరించిన టేబుల్ టెన్నిస్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ, చివరికి ఆ సీన్‌ను సినిమా ఫైనల్ కట్‌లో తొలగించాల్సి వచ్చిందని, దీంతో ఆ ఖర్చు అంతా వృథా అయిందని ఆమిర్ అన్నారు. కరోనా తర్వాత పెరిగిన నిర్మాణ ఖర్చు కూడా సినిమాపై ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. 'లాల్ సింగ్ చడ్డా' చిత్రంలో ఆమిర్ ఖాన్‌తో పాటు కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్, మానవ్ విజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. అయినప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడంలో విఫలమై, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.