Actress Maheswari: సినీ అభిమానులు తమ అభిమాన నటులపై ప్రేమను పెంచుకోవడం సర్వసాధారణం. అయితే ఆ ప్రేమను వ్యక్తపరిచేలోపే ఊహించని మాట వింటే ఎలా ఉంటుందో వివరించారు సీనియర్ నటి, గులాబి ఫేమ్ మహేశ్వరి. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌పై తనకున్న ప్రేమను బయటపెట్టేలోపే.. ఆయన తనను చెల్లెలుఅని పిలిచి షాకిచ్చారని ఆమె పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోలో పాల్గొన్న మహేశ్వరి తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను అజిత్‌కు పెద్ద అభిమానినని, ఆయనతో కలిసి ‘ఉల్లాసం’, ‘నీసమ్’ అనే రెండు చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ సమయంలో అజిత్‌పై తనకు విపరీతమైన క్రష్ ఏర్పడిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

నువ్వు నా చెల్లెలు లాంటి దానివి

"రెండో సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో అజిత్‌తో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. నా మనసులోని మాట ఆయనకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ధైర్యం సరిపోలేదు. షూటింగ్ చివరి రోజున, ఇక ఆయనతో మాట్లాడలేనని చాలా బాధపడ్డాను. నా దిగులును గమనించిన అజిత్ నా దగ్గరికి వచ్చారు" అని మహేశ్వరి వివరించారు.

అయితే ఆ సమయంలో అజిత్ ఆమెతో "నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. నీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పు" అని అన్నారని ఆమె తెలిపారు. ఆ మాట వినగానే తాను షాక్‌కు గురయ్యానని, దాంతో తన ప్రేమను వ్యక్తపరచలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. "అలా నా లవ్‌స్టోరీ మొదలవకముందే ముగిసిపోయింది" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. మహేశ్వరి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags: