Jayam Ravi: విడాకులు వచ్చే వరకు సినిమాలు చేయను.. : హీరో జయం రవి
హీరో జయం రవి
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంపై మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు. ఆయన ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్.. "నేను జయం రవి జీవితం నుండి పూర్తిగా తప్పుకుంటున్నాను" అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చెన్నై వదిలి వెళ్లిన మరుసటి రోజే రవి మీడియా ముందుకు వచ్చారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
తన భార్య ఆర్తితో నడుస్తున్న విడాకుల వివాదంపై జయం రవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా విడాకుల కేసు తేలే వరకు నేను ఎలాంటి సినిమాల్లో నటించను, నా కొత్త సినిమాలు ఏవీ థియేటర్లలో విడుదల కావు. ప్రస్తుతం నా మానసిక స్థితి అస్సలు బాలేదు. పెళ్లయినప్పటి నుండి నా భార్య ఆర్తి నన్ను మానసికంగా వేధిస్తూనే ఉంది. నిరంతరం నన్ను అవమానిస్తూ, చులకన చేసి మాట్లాడటం వల్ల నేను తీవ్రంగా గాయపడ్డాను." అని రవి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన భార్యపై రవి మోహన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను మానసికంగా దెబ్బతీయడానికి తనపై 'చేతబడి' (బ్లాక్ మ్యాజిక్) కూడా చేయించారని ఆయన ఆరోపించారు. "నా ఇద్దరు కొడుకులు నాతోనే ఉండాలి. వారు స్కూల్‌కు వెళ్తుంటే బాడీగార్డ్స్ పెట్టి నన్ను కనీసం చూడనివ్వడం లేదు. నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఈ పోరాటం చేస్తున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇప్పటివరకు ఒక్క సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, కేవలం జాయింట్ అకౌంట్ మాత్రమే ఉందని.. తను సంపాదించిన డబ్బు నుండి చిన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసినా ఎందుకు తీశావ్ అంటూ ఫోన్ చేసి వేధించేవారని చెప్పుకొచ్చారు.
ఈ వివాదంలో ఒక స్టార్ హీరోయిన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా జయం రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఒక మూడు అక్షరాల పేరున్న 'ఇడ్లీ' నటి (ఇడ్లీ నడిగై) తనను తాను పెద్ద ఫెమినిస్ట్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటూ.. తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుని తన సంసారాన్ని ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు తన గురించి మాట్లాడే ఎలాంటి నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ 'ఇడ్లీ నటి' ఎవరనే దానిపై కోలీవుడ్‌లో నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.
మరోవైపు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఈ వివాదం భరించలేక జయం రవితో బ్రేకప్ చెప్పుకుని చెన్నై వదిలి వెళ్లిపోయింది. విడాకుల కేసు కోర్టులో నడుస్తున్న సమయంలో లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే ఆమె రవికి సామరస్యంగా దూరంగా జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె దూరం కావడం, భార్య వేధింపులు ఎక్కువ కావడంతోనే జయం రవి ఇలా కెరీర్‌ను సైతం పణంగా పెట్టి సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించడం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద షాక్ ఇచ్చింది.