Vijay Deverakonda: సందీప్ కోసం ఎక్కడికైనా వెళ్తా.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్..
విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్..
Vijay Deverakonda: యంగ్ టాలెంట్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం రోమాంచకం. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేదికపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తనకున్న ప్రయాణాన్ని, గాఢమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సందీప్‌తో విడదీయరాని బంధం
తామిద్దరి మధ్య ఉన్నది కేవలం డైరెక్టర్-హీరో రిలేషన్ మాత్రమే కాదని, అంతకుమించిన ఆత్మీయ బంధమని విజయ్ పేర్కొన్నారు. "అర్జున్ రెడ్డి సమయంలో మా వద్ద డబ్బు, పలుకుబడి, ఫ్యాన్ బేస్ వంటివేమీ లేవు. ఆ సినిమా కోసం సందీప్ తండ్రి, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి తమ వ్యవసాయ భూములను అమ్మి అంతా పణంగా పెట్టారు. అలాంటి సందీప్ పిలిస్తే ఈ వేడుకకు రాకపోతే నా జీవితమే వృథా. సందీప్ కోసం నేను, నా కోసం సందీప్ ఎక్కడికైనా వెళ్తాం" అని స్పష్టం చేశారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌ను తన సొంత నిర్మాణ సంస్థలా భావిస్తానని తెలిపారు.
సుమంత్ ప్రభాస్‌కు భరోసా
ఈ చిత్ర కథానాయకుడు సుమంత్ ప్రభాస్‌లో మంచి కసి, సినిమాపై ఆకలి ఉన్నాయని విజయ్ ప్రశంసించారు. సుమంత్ నటుడిగా చేసినా, దర్శకుడిగా ప్రయత్నించినా ఫలితాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
రష్మిక ఆరోగ్యంపై అప్‌డేట్
ఈవెంట్‌లో రష్మిక మందన్న గురించి ప్రస్తావన రాగా.. ఆమెకు చిన్న గాయమైందని, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని విజయ్ వెల్లడించారు.
కాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రోమాంచకం చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.