Rashmika Mandanna: వరుస పాన్-ఇండియా విజయాలతో 'నేషనల్ క్రష్'గా వెలుగొందుతున్న ప్రముఖ నటి రష్మిక మందన్న ఇటీవల అనుకోని తుంటి గాయం కారణంగా తాత్కాలికంగా షూటింగ్‌లకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. తన తాజా చిత్రం మైసా చిత్రీకరణ సమయంలో గాయపడిన రష్మిక, ఈ అనుకోని విశ్రాంతి తన ఆలోచనా విధానాన్ని, జీవిత దృక్పథాన్ని ఎలా మార్చివేసిందో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

అలారం లేని నిద్ర.. కుటుంబంతో ప్రశాంత సమయం

ఎప్పుడూ షూటింగ్‌లు, ప్రయాణాలతో క్షణం తీరిక లేకుండా గడిపే రష్మిక, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తన కుటుంబంతో గడుపుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ భావోద్వేగ నోట్ రాసుకొచ్చారు. "ఎప్పుడూ నాన్‌స్టాప్‌గా పనిచేసే సమయంలో అకస్మాత్తుగా వేగం తగ్గించడం మొదట్లో భయంగా అనిపించింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నెమ్మదించాక చూస్తే.. గతంలో పడ్డ ఆ తీవ్రమైన పరుగు, ఒత్తిడే ఇప్పుడు మరింత భయాన్ని కలిగిస్తోంది. బహుశా జీవితం అంటే ఇదేనేమో" అని ఆమె పేర్కొన్నారు.

దినచర్యలో మార్పులు:

ప్రస్తుతం పుస్తకాలు చదవడం, పజిల్స్ సాల్వ్ చేయడం, తన పెంపుడు శునకం ఆరాతో ఆడుకోవడమే తన ప్రధాన వ్యాపకంగా మారిందని తెలిపారు. ఉదయాన్నే అలారం మోత లేకుండా ప్రశాంతంగా నిద్రలేవడం తన శరీరానికి ఎంతో మేలు చేస్తోందని, అప్పుడప్పుడు పనుల వేగాన్ని తగ్గించి నెమ్మదించడం కూడా మంచిదేనని ఆమె వెల్లడించారు.

పుష్ప, యానిమల్ వంటి భారీ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. తన చుట్టూ కుటుంబ సభ్యుల ప్రేమ, సానుకూల వాతావరణం, అభిమానుల ప్రార్థనలు ఉన్నాయని చెబుతూ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విరామం తనకు కొత్త శక్తిని, జీవితం పట్ల సరికొత్త అవగాహనను ఇచ్చిందని స్పష్టం చేశారు.

Tags: