Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ 'ఇరుముడి'. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే సినిమా గురించిన చర్చ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతున్న ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను నిన్న ఆగస్టు్ 24న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా విజయంపై చిత్ర యూనిట్ తమ భావోద్వేగాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఓటీటీలో తమిళ, మలయాళ సినిమాలు చూసి అలాంటి కథలు మనకు రావేంటి అనుకునేవాళ్లమని, సరిగ్గా అలాంటి అచ్చమైన మూలాలున్న కథతోనే 'ఇరుముడి' వచ్చిందని అన్నారు. హిందీలో రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు చూస్తే వచ్చే భావోద్వేగం, కన్నీళ్లు టాలీవుడ్‌లో ఈ సినిమా ఇస్తోందని ప్రశంసించారు. శివ టైటిల్ చెప్పగానే సూపర్‌ అన్నానని, చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. అయ్యప్పస్వామి రవితేజకు పెద్ద హిట్ ఇస్తే, రవితేజ మా అందరికీ మంచి హిట్ ఇచ్చారన్నారు. భక్తి, శ్రద్ధలతో పాటు ప్రేమానుబంధాల కలయికే ఈ 'ఇరుముడి' అని, సినిమా విడుదలయ్యాక సీలేరు ప్రాంతం టూరిస్ట్ స్పాట్‌లా మారిపోయిందని తెలిపారు. తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇలాంటి చిత్రంలో భాగం కావడం గర్వంగా ఉందని అన్నారు. ఇక కావేరి పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన నాయిక ప్రియా భవానీ శంకర్.. మళ్లీ 'ఇరుముడి' లాంటి సినిమా తీస్తేనే దర్శకుడు శివ నిర్వాణ రికార్డు బద్దలవుతుందని కొనియాడారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తామంతా ఒక యుద్ధంలా పనిచేశామని చెప్పారు. 'నిన్నుకోరి', 'మజిలి' తనను తెలుగు వారి ఇళ్లలోకి తీసుకెళ్తే, 'ఇరుముడి' నేరుగా అందరి హృదయాల్లోకి తీసుకెళ్లిందని భావోద్వేగానికి గురయ్యారు. హీరో రవితేజ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఇంటర్వెల్ సీన్‌లో తనను కొడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని ఆయన ఎప్పుడూ ఆలోచించలేదని, కేవలం కథను నమ్మి ముందుకు వెళ్లడం వల్లే ఇంతటి అద్భుత విజయం సాధ్యమైందని శివ నిర్వాణ స్పష్టం చేశారు.

Tags: