‘Jailer 2’: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ విడుదల తేదీపై కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా మరోసారి అదే తేదీని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ‘జైలర్ 2’ నవంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కొత్త పోస్టర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

‘జైలర్ 2’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రజినీకాంత్ చేతిలో గన్ పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపించారు. అక్టోబర్ 15న సినిమా వచ్చి థియేటర్లలో తుఫాను సృష్టించబోతుందనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ప్రస్తుతానికి ‘జైలర్ 2’ అనుకున్న తేదీకే వస్తుందని స్పష్టమైంది.

వాస్తవానికి ‘జైలర్ 2’ను 2026 ఏప్రిల్‌లో విడుదల చేయాలని తొలుత భావించారు. ఆ తర్వాత జూన్‌కు వాయిదా వేసి, చివరికి అక్టోబర్ 15 తేదీని లాక్ చేశారు. అయితే చాలా కాలంగా పెద్దగా ప్రమోషనల్ యాక్టివిటీ లేకపోవడం, విడుదలైన తొలి పాట కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో సినిమా మరోసారి వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది.

ఇదే సమయంలో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 15 రిలీజ్ డేట్‌పై కన్నేసిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ‘జైలర్ 2’ మేకర్స్ తాజా పోస్టర్‌తో ఆ తేదీ నుంచి తాము తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు.

దీంతో అక్టోబర్ 16న విడుదలకు ఇప్పటికే ప్రకటించిన విజయ్ దేవరకొండ ‘రణబలి’కి, అక్టోబర్ 15న థియేటర్లలోకి రానున్న రజినీకాంత్ ‘జైలర్ 2’తో నేరుగా పోటీ తప్పదని తెలుస్తోంది. దసరా సీజన్‌లో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారనుంది.

Tags: