Actress Janhvi Kapoor: జూమ్-ఇన్ షాట్లపై మండిపడ్డ జాన్వీ కపూర్
జాన్వీ కపూర్
Actress Janhvi Kapoor: సినీ నటీమణుల పట్ల కొందరు ఫోటోగ్రాఫర్లు ప్రవర్తిస్తున్న తీరుపై నటి జాన్వీ కపూర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలను చిత్రీకరించే సమయంలో అసభ్యకరంగా జూమ్-ఇన్ షాట్లు తీయడంపై ఆమె తన గళాన్ని వినిపించారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ఈ సంస్కృతి మహిళలను కేవలం ఒక వస్తువులా చూసేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందంగా కనిపించాలని నటీమణులు వేసుకునే దుస్తులను సాకుగా తీసుకుని, వారి శరీర భాగాలను ప్రత్యేకంగా జూమ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీయడం అగౌరవమని జాన్వీ అన్నారు. ఇలాంటి పనుల వల్ల మహిళలకు హాని కలుగుతుందని, తానే స్వయంగా కొందరు పాపరాజీలను కలిసి ఈ విషయంపై నిలదీశానని ఆమె వెల్లడించారు. ఒక మహిళ ఎలాంటి బట్టలు వేసుకున్నా, అది ఆమె వ్యక్తిగతమని.. అంతమాత్రాన అసభ్యకరమైన కోణాల్లో షూట్ చేయడానికి ఆమె అనుమతి ఇచ్చినట్లు కాదని జాన్వీ స్పష్టం చేశారు.
కేవలం వ్యూస్ కోసం, డబ్బు కోసం సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడం సరికాదని ఆమె హితవు పలికారు. మీడియాకు మరియు సెలబ్రిటీలకు మధ్య ఒక గౌరవప్రదమైన సరిహద్దు ఉండాలని ఆమె కోరారు. ఇక సినిమాల విషయానికి వస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన "పెద్ది" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.