Jason Sanjay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఈవెంట్‌లో సంజయ్ మాట్లాడుతూ సేలంలో షూటింగ్ చేసిన రోజులను గుర్తుచేసుకుంటూ, సినిమా ప్రమోషన్స్ అక్కడి నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అయితే, తన ప్రసంగంలో భాగంగా కుటుంబం గురించి ప్రస్తావించిన తరుణంలో అసలు సన్నివేశం చోటుచేసుకుంది.

'అందరికంటే ముందుగా నా కుటుంబానికి ధన్యవాదాలు చెప్పాలి' అని సంజయ్ అనగానే.. అక్కడున్న విజయ్ అభిమానులు ఒక్కసారిగా 'టీవీకే' అంటూ పెద్దపెద్ద నినాదాలతో సభను హోరెత్తించారు. అభిమానుల ఈ స్పందనకు సంజయ్ ఏమాత్రం తడబడకుండా చిరునవ్వుతో థంబ్స్-అప్ సింబల్ చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల విజయ్ సీఎంశ్రీగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు, స్వాతంత్ర్య వేడుకల్లోనూ సంజయ్ కనిపించకపోవడంతో వీరి కుటుంబంలో విభేదాలున్నాయంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు ఈ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు, స్పందించిన తీరు ఆ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టాయి.

ఇక సినిమా విషయానికి వస్తే.. దర్శకుడిగా మారాలన్న తన ఆలోచనను ముందుగా తన తల్లికే చెప్పినట్లు సంజయ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో 'సిగ్మా' మూమెంట్ ఉంటుందని, కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని ఎదగాలనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు. ఒక సాధారణ వ్యక్తి కథతో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి దర్శకుడిగా జాసన్ సంజయ్ మొదటి సినిమాతోనే ట్రెండింగ్‌లో నిలిచారు.

Tags: